తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కీలక అధికారులు ప్రస్తుతం జైల్లో ఉండగా.. మరొకరు విదేశాలకు కూడా వెళ్లిపోయారు. ఇక, ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్‌రావుపై కేసు పెట్టారు. దీంతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన హరీష్‌రావు.. హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని.. దీనిని క్వాష్ చేయాలని కోరుతూ.. ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో హరీష్‌రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది.
అయితే.. హరీష్‌రావు పోలీసులకు సహకరించాలని.. విచారణకు పిలిచినప్పుడు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను నిశితంగా గమనిస్తున్నామన్న హైకోర్టు.. కేసులు రాజకీయ ఉద్దేశంతోనే పెట్టి ఉంటే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరోవైపు కేసులు పెట్టిన చక్రధర్‌రావుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఏంటీ కేసు?
హైదరాబాద్ నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త.. చక్రధర్ గౌడ్.. బీఆర్ఎస్ హయాంలో పనులు చేసుకున్నారు. అయితే.. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. దీనివల్ల.. తన ప్రతిష్ట వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని గౌడ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇక్కడే హరీష్ రావు కీలక విషయం ప్రస్తావించారు. తనపై కేసు నమోదు చేసిన పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వలేదని, ప్రాథమిక సమాచారం కూడా సేకరించకుండానే వ్యవహరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులపై ఆయన హైకోర్టుకు వెళ్లారు.