ప్రభుత్వంపై పోరుబాటకు జగన్ పిలుపు

ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ విమర్శలకు దిగారు. ఆరు నెలలలోనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని జగన్ అన్నారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అంటూ సెటైర్లు వేశారు.

ఈ నేపథ్యంలోనే ఈనెల 11 నుంచి కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని వైసీపీకి నేతలు కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 11వ తేదీన రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు చేయాలని, ఆయా జిల్లాల కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని జగన్ పిలుపునిచ్చారు. రైతులకు 20వేల రూపాయల పెట్టుబడి సహాయం ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇక, డిసెంబర్ 27వ తేదీన పెంచిన విద్యుత్ చార్జీలపై ఆందోళన చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు.

విద్యుత్ ఎస్సీ కార్యాలయాలు, సిఎండి కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పారు. ఇక, జనవరి మూడో తేదీన ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై పోరాడాలని, పెండింగ్ ఫీజుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

కూటమి నేతలను ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని జగన్ అన్నారు. కరెంటు ఛార్జీలను బాదే పనులు మొదలయ్యాయని విమర్శించారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.