ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహంతో ఉన్నారా? ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రి వర్గ సమా వేశం అనంతరం.. సుభాష్‌తో ప్రత్యేకంగా మాట్లాడారా? ఆయనకు 20 నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. తాజాగా జరిగిన కాకినాడ పోర్టు వ్యవహారంలో మంత్రి వ్యవహరించిన తీరు విమర్శలకు దారిచ్చింది.
అదే విధంగా రొయ్యల ఫ్యాక్టరీల వ్యవహారం పై కూడా.. ఆయన వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యానికి తోడు మంత్రి సుభాష్‌పై పెరుగుతున్న ఫిర్యాదులు కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయి. ఇప్పటికి రెండు మూడు సార్లు ఆయన చెప్పి చూశారు. అయినప్పటికీ.. మంత్రి సుభాష్‌లో మాత్రం మార్పు అయితే కనిపించడం లేదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ సీనియర్లే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ అనంతరం 20 నిమిషాలపాటు సుభాష్‌తో ప్రత్యే కంగా చర్చించి.. ఆయన చేస్తున్న పొరపాట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు, కొందరిని వెనుకేసుకు వస్తున్న తీరును సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇలా అయితే.. కష్టం అని కూడా వ్యాఖ్యానించినట్టు సమా చారం. ఇటీవల రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున గుర్తించిన అధికారులు స్థానిక మంత్రిగా ఉన్న సుభాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆవెంటనే ఆయన అక్కడకు వెళ్లినా.. ఆ బియ్యాన్ని ఎవరు మిల్లు చేయించారన్న విషయాన్ని అడగకుండానే వచ్చారు.
అయితే.. సదరు మంత్రి అనుచరులకు చెందిన మిల్లు కావడంతోనే ఆయన వదిలి వేశారని కొన్ని పత్రిక ల్లో వార్తలు వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ఈ విషయంపై నిలదీశారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న సమయంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం.
ఇక, రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు వస్తున్నాయన్న ఫిర్యాదులు.. ఓ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలు తెలిసి అక్కడకు వెళ్లిన మంత్రి చూసీ చూడనట్టు వ్యవహరించడం పై కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే.. సుభాష్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారని సమాచారం.