ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనాలు పెరగనున్నాయి. రెండు ప్రతిపక్ష పార్టీల అధినేతలు ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరూ మిత్రులు కూడా కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. మరోసారి అధికారంలోకి వస్తామని భావించిన కేసీఆర్, జగన్‌లు ప్రజా తీర్పు కారణంగా.. పరాజితులయ్యారు. ఆ తర్వాత.. ఇద్దరూ కూడా దాదాపు ఇంటికే పరిమితం అయ్యారు. కేసీఆర్ ఏడాది కాలంలో ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చారు.
ఒక సారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు, మరోసారి ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సమయంలో నల్లగొండకు వచ్చిన ఆయన ప్రాజెక్టులు ఇవీ.. అంటూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపించారు. ఆ తర్వాత మళ్లీ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక, వైసీపీ అధినేత ఓటమి తర్వాత.. అసెంబ్లీకి రాకపోగా.. ప్రజల్లోకి రావడం లేదు. కేవలం ఇంటి నుంచే మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారు. దీంతో వైసీపీ పరిస్తితి తీవ్ర దారుణంగా మారిపోయింది.
నిజానికి బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ బయటకు రాకపోయినా.. ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్, మేనల్లుడు, హరీష్‌రావు వంటివారు.. ప్రజల్లోకి వస్తున్నారు బలమైన గళం వినిపిస్తున్నారు. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి కూడా లేదు. ఈ ప్రభావం వైసీపీపై ఎక్కువగానే పడుతోంది. తమ నాయకుడు మారడనే చర్చ వైసీపీలోనే ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో ఇరువురు నాయకులు కూడా జనవరి నుంచి జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు పార్టీలలో చర్చ సాగుతోంది.
ఈ విషయంపై జగన్ స్పందించారు. జనవరి నుంచి తాను జనంలోకి వస్తన్నట్టు చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా.. ఆయన ప్రజలను, పార్టీ కేడర్‌ను కలుసుకుని బలోపేతం చేయనున్నారు. ఇక, కేసీఆర్ రూట్ మ్యాప్ రెడీ కాలేదు. కానీ, ఆయన కూడా జనవరి నుంచే వస్తారని బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి సంక్రాంతి తర్వాత.. ముహూర్తం రెడీ చేసుకున్నారని సమాచారం. అయితే.. ఇప్పటికే రెండు సార్లు.. కేసీఆర్.. తాను ప్రజల్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇచ్చినా.. బయటకు రాలేదు. మరి ఈ సారైనా వస్తారోరారో చూడాలి.