ప్రకాశం జిల్లాలోని చీరాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. టీడీపీ తిరుగుబాటు ఎంఎల్ఏ కరణం బాలరామ్-వైసీపీ నేత ఆమంచి కృఫ్ణమోహన్ మధ్య విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. వీళ్ళద్దరి మధ్య ఏదో రూపంలో సర్దుబాటు చేయకపోతే భవిష్యత్తులో పార్టీలో తీరని నష్టం వస్తుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు సమాచారం. ఇఫ్పటికే చీరాల రాజకీయ పరిస్దితితులపై జగన్ దగ్గర ఫుల్ రిపోర్టుంది. దాంతో వీళ్ళద్దరిని పిలిపించి పంచాయితీని సెటిల్ చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి వైసీపీ తరపున పోటి చేశారు. టీడీపీ తరపున పోటి చేసిన కరణం బలరామ్ గెలిచారు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో పాటు భవిష్యత్తుపై ఆలోచనతోనే గెలిచిన కరణం వైసీపీకి దగ్గరయ్యారు. తన కొడుకు కరణం వెంకటేష్ తో పాటు మద్దుతుదారులను కూడా వైసీపీలో చేర్చారు. దాంతో కరణం కూడా అనధికారికంగా వైసీపీ ఎంఎల్ఏగానే చెలామణవుతున్నారు. సహజంగానే ఎంఎల్ఏకి ఇచ్చే ప్రోటోకాల్ కరణంకు దక్కుతుండటంతో ఆమంచికి మండిపోయింది. దీంతో రెండు వర్గాల మధ్య ప్రతి విషయానికి గొడవలు మొదలై చివరకు పీక్సుకు చేరుకున్నాయి.
గతంలొ అద్దంకి నుండి గెలిచిన కరణం ప్రస్తుతం చీరాలలో గెలవటంతో ఇక భవిష్యత్తంతా చీరాలలోనే కంటిన్యు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో అద్దంకిలో తన కొడుకు వెంకటేష్ ను ప్రొజెక్టు చేస్తున్నారు. అంటే ఇటు చీరాల అటు అద్దంకి రెండు చోట్లా కరణం కుటుంబమే అధికారం చెలాయించాలని చూస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమంచి కరణంకు ఎదురుతిరుగుతున్నారు. ఆమంచిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడు ఇచ్చిన మాట తప్పటం జగన్ కు ఇష్టంలేదు. అలాగని కరణంను దూరంగా పెట్టటమూ సాధ్యంకాదు. అందుకనే మధ్యేమార్గంగా జగన్ ఓ ఫార్ములా మీద వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం.
అదేమిటంటే వచ్చే ఎన్నికల వరకు కరణంను చీరాల నుండి కదిల్చే అవకాశం లేదు కాబట్టి తర్వాత అద్దంకికి కానీ లేదా పర్చూరుకు కానీ మార్చాలని అనుకుంటున్నారట. ఈ రెండు నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గానిదే పై చేయి. పైగా అద్దంకిలో కరణం కుటుంబానికి మంచి పట్టుకూడా ఉంది. కాబట్టి పై రెండు సీట్లలో కరణం కుటుంబానికి అప్పగించి రిజల్ట్ తేవాలని కండీషన్ పెట్టే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.
దీనికి అదనంగా డీసీసీబీ ఛైర్మన్ పదవిలో కూడా కమ్మ సామాజికవర్గంలోని నేతనే నియమిస్తే జిల్లా వ్యాప్తంగా కమ్మ సామాజికవర్గంపై పట్టు సాధించినట్లవుతుందని జగన్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఆమంచికి మళ్ళీ చీరాలను అప్పగిస్తే భవిష్యత్తులో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తకుండా ఉంటాయన్నది జగన్ మార్క్ వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఆమంచికి చీరాలలో ఎంత పట్టుందో అంత నెగిటివ్ కూడా ఉంది. మరి ఆమంచి మీదున్న నెగిటివ్ ను జగన్ ఎలా పోగొడతాడో చూడాల్సిందే. తొందరలోనే ఇద్దరినీ కూర్చోపెట్టి పంచాయితీ పరిష్కరించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏమవుతుందో చూడాల్సిందే.