కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ, ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి పట్టంకట్టనున్నారా? ఆమె పేరు పరిశీలనలో ఉందా? అంటే.. జాతీయ మీడియా వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమె పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చిందని కూడా చెబుతున్నాయి. దీనికి రెండు కారణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
1) వచ్చే నెలలో.. ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అవకాశం. 2) దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించేందుకు పార్టీ నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. పురందేశ్వరి అయితే.. మూడు రాష్ట్రాల్లో(ఏపీ, తెలంగాణ, తమిళనాడు) మంచి పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం.. అనర్గళం ఆయా భాషలు మాట్లాడే సామర్థ్యం ఉండడం.. తండ్రి వారసత్వం వంటివి కలిసి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
మొత్తంగా పురందేశ్వరి పేరు అయితే.. ఇప్పుడు బీజేపీ వర్గాల్లో హల్చల్ చేస్తోందని చెబుతుండడం గమ నార్హం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురందేశ్వరి.. రాజంపేట నుంచి ఎంపీ గా పోటీ చేశారు. అయితే.. ఓడిపోయారు. తాజాగా రాజమండ్రి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నా రు. ఈ క్రమంలోనే కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. కానీ, ఆమె పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి కారణం అప్పట్లోనే ఆమెకు అంతకన్నా పెద్ద పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు రావడమే.
ఇక, ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ సారథిగా ఉన్నారు. అయితే.. ఆయనకు పనిభారం పెరగడంతోపాటు బీజేపీ నిర్దేశిత నిబంధనలు కూడా.. వరుసగా ఒకే వ్యక్తికి ఇన్నిమార్లు పదవిని కొనసా గించడాన్ని నిషేధిస్తున్నాయి. ఈ క్రమంలో నడ్డాను మార్చడం ఖాయం. మరోవైపు వచ్చే ఏడాది ఎన్నిక లు ఉన్నాయి. ఈ క్రమంలో పురందేశ్వరికి ఈ పదవిని ఇచ్చి.. ఆయా రాష్ట్రాల్లో విజయం దక్కించుకునేలా మహిళా సెంటిమెంటును ప్రోది చేసేలా కమల నాథులు ప్లాన్ చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల మాట.
ఏపీకి కొత్తకాదు..
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి.. ఏపీ నాయకులకు కొత్తకాదు. గతంలో ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు సార్లు ఆయన టెర్మ్ పొడిగించారు. తర్వాత.. ఉమ్మడి ఏపీకే చెందిన బంగారు లక్ష్మణ్ కూడా.. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేసినవారే. బండారు దత్తాత్రేయ కూడా.. కొన్ని నెలలపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. సో.. ఇప్పుడు పురందేశ్వరి ఇవ్వడం కొత్తకాకపోయినా.. మహిళా నాయకురాలిని ఎన్నుకోవడం మాత్రం సంచలనమే కానుంది. మరి జరుగుతుందా? లేదా? అనేది చూడాలి.