వక్ఫ్ బోర్డు రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ!!

ఏపీలో వక్ఫ్ బోర్డును సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసింది…కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతోన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది…ముస్లింలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేసింది..ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. కానీ, వాస్తవం అది కాదు. నిబంధనలు తుంగలో తొక్కి వైసీపీ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు తెచ్చిన జీవో నంబర్ 47ను మాత్రమే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కు తీసుకుందని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణనిచ్చింది.

జగన్ హయాంలో ఆయనకు నచ్చిన కొందరు సభ్యులతో వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. అందుకోసం జీవో 47ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ, బోర్డు సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగాయని, నిబంధనల ప్రకారం సభ్యులను నియమించలేదని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. వక్ఫ్ బోర్డులో మాజీ ఎంపీలకు అవకాశం కల్పించకపోవడం, పారదర్శకత లేకుండా జూ.లాయర్లను బోర్డు సభ్యులుగా గత ప్రభుత్వం నియమించింది.

ఈ క్రమంలోనే జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 47ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంకా చెప్పాలంటే మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు సభ్యులు పని చేయడం లేదు. దీంతో, వక్ఫ్ బోర్డులో పరిపాలన సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో జీవో నెం.47 ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఏపీ సర్కార్ క్లారిటీనిచ్చింది. దానికితోడు వక్ఫ్ బోర్డులో అంతర్గత వివాదాలు, సమస్యల వల్ల చైర్మన్‌ నియామకం సమస్యగా మారిందని వెల్లడించింది.

వర్క్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు, సుపరిపాలన కోసం ఆ జీవోను వెనక్కు తీసుకున్నామని తెలిపింది. అందుకే, వక్ఫ్ బోర్డులో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్ది త్వరలోనే కొత్త సభ్యులతో, ఛైర్మన్ తో వక్ఫ్ బోర్డును నూతనంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.