ఢిల్లీలో జల వివాదాలపై జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత తెలంగాణా పార్టీల నుండి జగన్మోహన్ రెడ్డికి ఫుల్లుగా మద్దతు పెరిగిపోయింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా వాదించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమంలో తెలంగాణా సీఎం కేసీయార్ పై రాజకీయపార్టీలు మండిపోతున్నాయి. జగన్ ముందు కేసీఆర్ వాదన తేలిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా ప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్ ఫెయిల్ అయినట్లు బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపణలు మొదలుపెట్టాయి. తెలంగాణా ప్రాజెక్టులపై కేసీఆర్ వాదన కౌన్సిల్ సమావేశంలో తేలిపోయిందంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బట్టి విక్రమార్క కామెంట్ చేశారు.
తెలంగాణా ప్రాజెక్టులో నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో కేసీఆర్ వ్యవహార శైలి కారణంగా నష్టం జరగటం ఖాయమని తేలిపోయిందంటూ సంజయ్ బహిరంగ లేఖలో మండిపడ్డారు. జల వివాదంలో ఏపిని కేసీఆర్ తేలిగ్గా తీసుకున్న కారణంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణా తోక ముడవాల్సొచ్చిందంటూ బండి విరుచుకుపడ్డారు. కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకునేది లేదని, ప్రాజెక్టులపై డీపీఆర్లు సమర్పించేది లేదని చెప్పిన కేసీయార్ ఢిల్లీ సమావేశంలో అందుకు భిన్నంగా ఎందుకు ఒప్పుకోవాల్సొచ్చిందని బండి నిలదీశారు.
ఇదే విషయమై భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణా జలాల పరిరక్షణలో కేసీఆర్ ఫెయిల్ అయినట్లు ఆరోపించారు. కేసీఆర్ వైఖరి కారణంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ వాదన హైలైట్ అయ్యిందన్నారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పట్టుబట్టడంలో తప్పు లేదన్న బట్టి జగన్ చేసింది మంచిపనే అంటు ప్రశంసించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ వాదన వినిపించినట్లు కేసీఆర్ ఎందుకు వినిపించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.
ఇదే విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ కూడా కేసీఆర్ పై మండిపోయారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణా వాదన కౌన్సిల్ సమావేశంలో వీగి పోయిందన్నారు. ఏపి జల సంనక్షణ కోసం జగన్ చేసిన వాదనలో తప్పేమీ లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపి ప్రయోజనాల కోసం జగన్ చేసిన వాదనకు తెలంగాణాలో ప్రధాన రాజకీయపార్టీలు మద్దతుగా నిలబడ్డాయి. ఇదే సమయంలో ఏపిలోని రాజకీయ పార్టీలు మాత్రం జగన్ కు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.