కొద్ది కాలంగా కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గోల్డ్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. గోల్డ్ స్కాం నిందితుల విషయంలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటులోని పేర్లలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరుండటం సంచలనంగా మారింది. స్కాంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ కు సిఎంతో సన్నిహిత సంబంధాలుండటంతో ముఖ్యమంత్రి పాత్రతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల పాత్రపై మరింత లోతుగా విచారణ జరపాలని ఈడీ తన చార్జిషీటులో చెప్పటం గమనార్హం.
దాదాపు ఐదు నెలల క్రితం గోల్డ్ స్కాం బయటపడింది. కేరళ-దుబాయ్ మార్గంలో అక్రమంగా స్వప్న సురేష్ అనే మహిళ తన సన్నిహితుల ద్వారా పెద్ద ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు బయటపడింది. దుబాయ్ నుండి సుమారు 150 కిలోల బంగారు కడ్డీలను కేరళకు స్వప్న తెప్పించినట్లు ఆధారాలు కూడా దొరికాయి. తిరువనంతపురంలోని దుబాయ్ రాయబార కార్యాలయంలోని తన సన్నిహితుల సహకారంతో ఎటువంటి చెక్కింగులు లేకుండానే స్వప్న బంగారాన్ని తెప్పించినట్లు తన దర్యాప్తులో ఈడీ బయటపెట్టింది. దీన్ని స్వప్న కూడా అంగీకరించినట్లు చార్జిషీటులో చెప్పారు.
స్వప్న తనకున్న సాన్నిహిత్యం ద్వారా తరచూ ముఖ్యమంత్రితో సమావేశం అవ్వటమే కాకుండా సిఎం కార్యాలయంలోని ఉన్నతాధికారులతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నట్లు బయటపడింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ప్రిన్సిపుల్ సెక్రటరీ శివశంకర్ ను కూడా ఈడి విచారించింది. విజయన్ సమక్షంలోనే స్వప్న శివశింకర్ ను చాలాసార్లు కలిసేవారని, తనకు కావాల్సిన ఆదేశాలను ఇఫ్పించుకునే వారని చార్జిషీట్లో ఈడి చెప్పటం గమనార్హం.
ఈడి చార్జిషీట్లో చెప్పిన విషయాలను బట్టి చూస్తే స్వప్న చేసే బంగారం స్మగ్లింగ్ వ్యవహారాలకు విజయన్ అనుమతి ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దర్యాప్తులో స్వప్న చెప్పిన విషయాలు కూడా ఇదే ధృవీకరిస్తోంది. దాంతో బంగారం స్మగ్లింగ్ కుంభకోణం రాష్ట్రంలో కీలక మలుపు తిరిగింది. అయితే ఈ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణలను విజయన్ మొదటి నుండి కొట్టిపారేస్తున్నారు. సరే చార్జిషీటులోని అంశాలేమిటి ? ఎవరి పాత్ర ఎంతవరకు అన్న విషయాలు ఎలాగున్నా చార్జిషీటులో సిఎం పేరుండటం మాత్రం సంచలనం సృష్టిస్తోంది.