టీటీడీలో మ‌రిన్ని ప‌ద‌వులు.. జాబితా కూడా పెద్ద‌దే!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన కీల‌క‌మైన ప‌ద‌వుల భ‌ర్తీలో కూట‌మి స‌ర్కారుకు ఆప‌శోపాలు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌లే.. టీటీడీ పాల‌క మండలిని సీఎం చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ ప‌ద‌వుల కోసం చాంతాడంత జాబితా వ‌చ్చింది. దీంతో తాను ముందుగానే నిర్ణ‌యించుకున్న విధంగా చంద్ర‌బాబు అడుగులు వేశారు. వాస్త‌వానికి పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి కోసం.. పెద్ద ఎత్తున నాయ‌కులు క్యూ క‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆచి తూచి నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, ఇప్పుడు ఇదే తిరుమ‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన ప‌ద‌వుల భ‌ర్తీ చేప‌ట్టాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. వీటిలో శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ చైర్మ‌న్‌, అదేవిధంగా ఈ ఛానెల్‌కు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(సీఈవో), స‌ల‌హాదారు, ముఖ్య స‌ల‌హాదారు ప‌ద‌వులు ఎదురు చూస్తున్నాయి. వీటితో పాటు.. శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఎస్‌విఇటిఎ) ఛైర్మన్ ప‌ద‌వి కూడా ఉంది. ఇవ‌న్నీ టీటీడీలో ప్రాధాన్యం ఉన్న‌వే కావ‌డం విశేషం.

దీంతో ఆయా ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు కూడా ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా ఎదురు చూస్తున్నారు. ప్ర‌ధానంగా శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ చైర్మ‌న్ కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఇచ్చారు. వైసీపీ హ‌యాంలో ఇది వివాద‌మైంది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రాఘ‌వేంద్ర రావు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న‌తోపాటు ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌, నిర్మాత సి. అశ్వినీద‌త్‌లు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఎస్వీబీసీ సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులకు కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంద‌ని తెలిసింది. ఈ ప‌ద‌వుల‌పై జ‌న‌సేన నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే తిరుప‌తికి చెందిన యువ‌నాయ‌కుడు, ఎన్నిక‌ల్లో టికెట్ఆశించి భంగ ప‌డిన జ‌న‌సైనికుడు ఎస్వీబీసీ చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నాయ‌కురాలు సుగుణ‌మ్మ కూడా నామినేటెడ్ ప‌ద‌విపై మంత్రి నారా లోకేష్‌ను అభ్య‌ర్థించారు. అటు సినీ రంగానికి చెందిన‌వారు. ఇటు రాజ‌కీయ రంగానికి చెందిన‌వారు .. కూడా ఈ ప‌ద‌వుల కోసం ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం.