అదానీ కేసును లైట్ తీసుకున్న కేంద్రం.. ఏమందంటే!

భార‌త్‌కు చెందిన‌, ముఖ్యంగా గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త్ స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చ‌ర్చ జ‌రిగింది. అంతేకాదు.. ఈ కేసులు ప్రూవ్ అయితే.. అన్నేళ్లు జైలు ప‌డుతుంది… ఇంత జ‌రిమానా ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, అదానీకి, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య లంచాల లావాదేవీలు కూడా జ‌రిగాయ‌ని అమెరికా ద‌ర్యాప్తు అధికారులు ఎఫ్‌బీఐ.. స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో స్ప‌ష్టంగా ఉంది. అదేస‌మ‌యంలో త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశాల్లోనూ ఈ లంచాల వ్య‌వ‌హారం ముందుకు సాగింద‌న్న చ‌ర్చ కూడా ఉంది.

ఇంకా ఈ చ‌ర్చ‌కు తెర‌ప‌డలేదు. ఈ కేసు ముగిసి పోలేదు. మ‌రి దేశాన్ని, ప్ర‌పంచ దేశాల‌ను , రాజ‌కీయ పార్టీల‌ను కూడా ఇంత‌గా కుదిపేస్తున్న అదానీ వ్య‌వ‌హారంపై కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుంద‌ని.. అంద‌రూ వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూశారు. అంతేకాదు.. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో ఈ వ్య‌వ‌హారం వేడి పుట్టిస్తోంది కూడా. రోజూ స‌భ‌లు ఇదే విష‌యంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డంతో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. మ‌రి ఇంత ప్రాధాన్యంతో కూడుకున్న ఈ కేసును కేంద్రం ఎలా తీసుకుంది? అంటే.. లైట్ తీసుకుంది. ఇది `ప్రైవేటు వ్య‌క్తుల‌కు-అమెరికాకు మ‌ధ్య కేసు“ అని తేల్చి చెప్పింది.

అంటే.. ప్ర‌పంచ కుబేరుడిగా, ప‌లు రాష్ట్రాల్లో పోర్టులు సొంతం చేసుకుని భారీ పారిశ్రామిక వేత్త‌గా ఉన్న అదానీని కేవ‌లం `ప్రైవేటు వ్య‌క్తి` అనే చిన్న కార‌ణంగా కేంద్రం ఈ కేసును ప‌క్క‌కు పెట్టేయ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. “ఇది ప్రైవేటు వ్య‌క్తులు-అమెరికా న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన కేసు. మ‌న‌కు ఎలాంటి సంబంధం లేదు. అమెరికా కూడా మ‌న‌ల్ని ఏమీ అడ‌గ‌లేదు. మ‌న నుంచి ఎలాంటి స‌మాచారం కూడా కోర‌లేదు. సో.. ఇంత‌క‌న్నా మ‌నకు తెలియ‌దు“ అని వ్యాఖ్యానించా రు. అంటే.. మొత్తంగా అమెరికా స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అదానీపై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసులు న‌మోదైనా కేంద్రం జోక్యం చేసుకునేది లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు.. దేశంలో కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌ను కూడా పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కేంద్రం భావిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. దీనిని బ‌ట్టి అటు పార్ల‌మెంటులో అయినా.. ఇటు బ‌య‌ట అయినా.. ప్ర‌తిప‌క్షాలు యాగీ చేసిన‌న్నాళ్లు చేస్తాయి. త‌ర్వాత అవే శాంతిస్తాయ‌న్న ధోర‌ణిలో కేంద్రం ఉండ‌డం మ‌రో విశేషం. మ‌ణిపూర్ అల్ల‌ర్లు, అక్క‌డ మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అత్యాచారాలు, దాడుల విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం గ‌త రెండేళ్లుగా మౌనంగా ఉన్న విష‌యం ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం.