జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. పవన్ రాష్ట్ర అవసరాల మేరకే ఢిల్లీకి వెళ్లగా.. తన అన్నయ్య నాగబాబు రాజ్యసభ సభ్యత్వం గురించి ఎన్డీయే పెద్దలతో చర్చించడానికి వెళ్లాడంటూ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని స్వయంగా నాగబాబు స్పష్టం చేశాడు. తనకు పదవీ కాంక్ష లేదని తేల్చేశాడు. ఇదిలా ఉండగా.. ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అందులో ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో పవన్ పేర్కొన్న విషయాల మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్‌కు ఉత్తరాది జనాలు జేజేలు పలుకుతుండడం విశేషం. తిరుమల లడ్డు వివాదం మొదలైన దగ్గర్నుంచి హిందూ సనాతన ధర్మం గురించి పవన్ బలంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుమల ప్రసాదం, టీటీడీ నూతన విధానం గురించి పవన్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. టీటీడీ పరిధిలో అన్య మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకుండా కొత్తగా తెచ్చిన విధానం గురించి పవన్‌ను ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. చాలా క్లియర్‌గా సమాధానం చెప్పాడాయన. మక్కాకు వెళ్లి ఒక హిందువుకు నిర్వహణ బాధ్యతలు ఇవ్వమని అడిగితే వాళ్లు ఇస్తారా.. జెరూసలేంకు వెళ్లి హిందువులకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వమంటే ఊరుకుంటారా.. అలాంటపుడు హిందూ ఆలయంలో వేరే మతస్థులు ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారు అని పవన్ ప్రశ్నించాడు.
హిందూ మతం మీద, దేవుళ్ల మీద నమ్మకం ఉన్న వాళ్లు.. ఆ మతానికి చెందిన వాళ్లే టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించాలని.. ఇందులో మరో మాటకు తావు లేదని.. ఈ విషయంలో తాము చాలా స్పష్టతతో ఉన్నామని పవన్ తేల్చి చెప్పాడు. సగటు రాజకీయ నాయకులు ఇలాంటి వ్యవహారాల్లో స్పష్టంగా సమాధానం చెప్పడానికి వెనుకాడతారు. వేరే మతస్థుల్లో వ్యతిరేకత వస్తుందేమో అనుకుంటారు. కానీ పవన్ మాత్రం చాలా స్పష్టంగా ఈ ప్రశ్నకు ఇలా బదులివ్వడం ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఆయన మీద పొగడ్తలు కురిపిస్తుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates