సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు పొందేందుకు ఉద్యోగుల ప్రయోజనాలను ఆయన తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇక, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వెంకట్రామిరెడ్డి తన హవా సాగించాలని చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను మద్యం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
త్వరలో జరగబోతోన్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవులు దక్కించునేందుకు వెంకట్రామిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు, విందు ఇచ్చే క్రమంలో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారని ఎక్సైజ్ శాఖ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో, తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులకు వెంకట్రామిరెడ్డి ఇస్తున్న మందు పార్టీపై పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకట్రామిరెడ్డి ఏమిటీ పాడుపని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.