రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి సమక్షంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్చువల్ గా భేటీ కావటం.. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఎవరికి వారు తమ వాదనల్ని వినిపించటమే కాదు.. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శలకు వెనుకాడలేదు.
కట్ చేస్తే.. సమావేశం పూర్తి అయ్యింది. రెండు అధికారపక్షాలకు మీడియా సంస్థలు ఉండటం.. వారి కనుసన్నల్లో సాగే పత్రికల్లో ఈ భేటీ గురించి ఎవరెలాంటి కవరేజ్ ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. మిగిలిన మీడియాను వదిలేస్తే.. రెండు అధికారపక్షాలకు చెందిన మీడియా సంస్థలు కావటం.. వారిద్దరి వాదనలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఆ రెండు పేపర్లను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపించక మానవు.
తెలంగాణ అధికారపక్షానికి చెందిన నమస్తే తెలంగాణ దినపత్రికలో.. అపెక్సులో కేసీఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారన్నట్లుగా వార్తలు ఇచ్చేశారు. అంతేకాదు.. సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా వ్యవహరించటమే కాదు.. ఏపీ అన్యాయాల్ని కడిగేసినట్లుగా వార్తలు వచ్చేశాయి. అంతేకాదు.. కేంద్రం కాని ఏపీ సర్కారును కట్టడి చేయకుంటే తాము కూడా ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టేస్తామన్న దూకుడును వార్తల్లో ప్రదర్శించటం గమనార్హం.
అదే సమయంలో ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షిలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వార్తలు ఇవ్వటం కనిపించింది. తెలంగాణలో రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇవ్వటానికి ఓకే చెప్పిన వైనాన్ని హైలెట్ చేయటమే కాదు.. ఏపీ అక్రమ నిర్మాణాలు ఆపకుంటే బాబ్లీ తరహాలో బ్యారేజీ కడతామన్న కేసీఆర్ హెచ్చరికకు భారీ ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. సాక్షి తెలంగాణ ఎడిషన్ లో ఇలా వార్తలు ఇచ్చి.. ఏపీ విషయానికి వస్తే.. భోర్డుల పరిధి నోటిఫై చేస్తాం అంటూ నిదానాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. రెండు అధికారపక్షానికి చెందిన పత్రికలే అయినప్పటికీ.. కీలకమైన వార్తను డీల్ చేసే విషయంలో మాత్రం చెరో దారిని ఎంచుకున్నాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates