“వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం” అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్‌బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021-22 మధ్య కాలంలో తనను అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి.. తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించిన వారిని జైలుకు పంపేవరకు.. తనకు మనశ్శాంతి లేదని చెప్పారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు.
ఇక, ఇప్పటికే ఈ కేసులో మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం కోర్టు ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపైనే రఘురామ స్పందించారు. విజయ పాల్ కు పాపం పండిందని, విజయ పాల్ ఎన్నో దందాలు చేశారని దుయ్యబట్టారు. ఆయనంత దుర్మార్గుడు మరొకరు లేరన్నారు.
తనను కస్టోడియల్ టార్చర్ చేసింది భౌతికంగా హింసించింది కూడా విజయ్‌పాలేనని రఘురామ చెప్పా రు. అయితే.. ఈయనను ఆడించింది.. ఆదేశాలు పాటించేలా చేసింది మాత్రం అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమారేనని రఘురామ చెప్పారు. అసలు నేరస్తులను కూడా వదిలి పెట్టకూడదని.. ఆ దిశగా పోలీసులు పక్కా ఆధారాలు ఇప్పటికే సేకరించారని తాను భావిస్తున్నట్టు రఘురామ వెల్లడించారు.
కస్టడీలో తనను కొట్టిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని రఘు రామ తేల్చిచెప్పారు. ఇదేసమయం లో కూటమి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు అరెస్టు భయం పట్టుకుందని, దీంతో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉందని తెలిపారు. అతను పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు.