వైసీపీ పాలనలో ప్రజా ధనం నీళ్లలా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అందిన కాడికి అప్పులు చేయడం ఒక ఎత్తయితే..అవకాశం ఉన్న చోటల్లా స్కామ్ లు చేసి సైలెంట్ గా ఉండడం మరో ఎత్తు అన్న రీతిలో జగన్ పాలన సాగిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పఫ్ లు మొదలు పెన్నుల వరకు జనం సొమ్మును జగన్ దుబారా చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం బయటపడింది.
కడప ఎయిర్ పోర్ట్ పనుల్లో రూ 165.72 కోట్లు మాయమయ్యాయని ఆడిటర్ జనరల్ (ఏజీ) తాజాగా నిర్ధారించిన వైనం సంచలనం రేపుతోంది. నిబంధనలను తుంగలో తొక్కిన జగన్ సర్కార్ భారీ మోసానికి తెరలేపిందని ఏజీ తాజాగా గుర్తించింది. ఆర్థిక శాఖకు తెలియకుండా పీఏవోల ద్వారా ఐ అండ్ ఐ ఎనర్జీస్ సంస్థకి రూ 165.72 కోట్ల బిల్లును పాస్ చేయించిందని ఏజీ గుర్తించంది. అంతేకాదు, ఆ భారీ మొత్తాన్ని ఏపీఐఐసీ బ్యాంకుకు బదిలీ చేసిన వైనాన్ని ఏజీ బట్టబయలు చేసింది. ఇలా తమ అనుయాయ కంపెనీకి జగన్ సర్కార్ ఇష్టం వచ్చినట్లు బిల్లులు పాస్ చేయడంపై ఏజీ వివరణ కోరింది.
అయితే, బయటపడింది ఈ ఒక్క వ్యవహారమేనని, ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అనుయాయులకు జగన్ పలు బిల్లులను అడ్డగోలుగా మంజూరు చేసుకున్నారని, బయటి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శిస్తున్నారు. ఆ తరహాలోనే నిధుల మళ్లింపులు చాలా జరిగాయని వాటిపై కూడా ఏజీ ఫోకస్ చేయాలని కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates