ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై గతంలో దర్శకుడు వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వ్యవహారం ఇప్పుడు వర్మ మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వర్మపై పలు చోట్ల కేసులు నమోదు కాగా..వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వర్మ బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. మరోవైపు, వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కానీ, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..వర్మ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీతో పాటు మరికొందరు విచారణకు హాజరుకాకపోవడంపై తాను ఇప్పుడే స్పందించనని, పోలీసులను వారి పని చేసుకోనివ్వాలని అన్నారు. తన పని తాను చేస్తానని, పోలీసుల సామర్థ్యంపై స్పందించబోనని పవన్ అన్నారు.
ఇక, హోంశాఖ, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై చంద్రబాబు గారిని అడగాలని, తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలని అన్నారు. అయితే, మీడియా ప్రతినిధులు చెప్పిన అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పారు. చంద్రబాబు, పవన్ లను ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా తనను అడిగిన విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెబుతానని పవన్ అన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో దూకుడుగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు వర్మ వంటి వారి అరెస్టుల వ్యవహారంలో స్లోగా ఎందుకు ఉంది అన్న ప్రశ్నకు పవన్ ఆ విధంగా బదులిచ్చారు.
ఇక, అదానీ-జగన్ ముడుపుల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు పవన్. సమోసాల కోసం జగన్ రూ .9 కోట్లు ఖర్చుపెట్టారని, ఆ ప్రభుత్వానికి అసలు బాధ్యత, పారదర్శక , జవాబుదారీతనం లేవని పవన్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి శాపాలుగా మారాయని అన్నారు.