ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏపీకి సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను ఆయన కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదనపు కేటాయింపులపై ఆయన చర్చించినట్టు చెప్పారు. పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కూడా కలుసుకో నున్నారు. అయితే, దీనిలో ఒకటి అధికారిక పర్యటనకాగా.. మరొకటి ప్రైవేటు పర్యటన కావడం గమనార్హం. అధికారికంగా గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన పవన్.. రాష్ట్ర పర్యాటక రంగంపై చర్చించారు.
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించి 7 కీలక అంశాలు ఉన్నాయని, వాటిని డెవలప్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో నిధుల కేటాయింపు, ప్రోత్సాహ కం వంటి విషయాలపై మాట్లాడినట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఏపీకి 975 కిలో మీటర్ల మేర కోస్టల్ ప్రాంతం ఉందని, దీనిని డెవలప్ చేసుకుంటే పర్యాటక పరంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
నిధులు కూడా కేటాయించాలని కోరినట్టు పవన్ చెప్పారు. ఇదిలావుంటే, ప్రైవేటు పర్యటనలో భాగంగా పవన్.. బీజేపీ పెద్దలను కలుసుకుంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్ని కల్లో పవన్ ప్రచారం చేయడం, ఆయన ప్రసంగించిన నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి పార్టీలు విజయం దక్కించుకున్న నేపథ్యంలో జాతీయ నాయకులు పవన్‌ను అభినందించనున్నారు. ఇదేసమయంలో అదానీ-జగన్ వ్యవహారం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఆ వ్యవహారంలో ఎన్డీయే మిత్రపక్షాలుగా ఉన్న వారు ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా బీజేపీ పెద్దలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్‌ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తటస్థ మీడియాలో అదానీని వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయే పక్షాలు అదానీ లంచాల కేసులపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే బీజేపీ నేతలు ఒక రూట్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నారు. దానిప్రకారమే మాట్లాడాలని అధికార ప్రతినిధులను కూడా ఆదేశించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates