రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మాజీ సీఎం జగన్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ చివరకు ఒక్క రాజధాని కూడా లేకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ ఘోరంగా దెబ్బతీశారని విమర్శలు వచ్చాయి. అయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుబెట్టిందని మంత్రి నారాయణ అన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని నారాయణ చెప్పారు. 5 ఐకానిక్ టవర్లకు సంబంధించి డిజైన్ కాంట్రాక్ట్ నారిమన్ ఫాస్టర్ కంపెనీకి ఇచ్చామని అన్నారు. రాజధాని అమరావతిపై సీఆర్డీఏ అథారిటీ అధికారులతో నారాయణ సమీక్ష జరిపారు. అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారని, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ తెస్తామని నారాయణ చెప్పారు.
5 ఐకానిక్ భవనాల డిజైన్ కాంట్రాక్టును నారిమన్ ఫాస్టర్ కంపెనీ దక్కించుందని అన్నారు. దానిని ఈ రోజు సీఆర్డీఏ అథారిటీ ముందు పెట్టి అప్రూవల్ చేశామని అన్నారు. దీంతోపాటు ఏ టెండర్ వచ్చినా సీఆర్డీఏ అథారిటీ అప్రూవ్ చేయాల్సిందేనని అన్నారు. అంతకుముందు చేసిన డిజైన్ అసంపూర్తిగా ఉందని, ఆ డిజైన్ ను గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని అన్నారు. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి డిజైన్ కోసం టెండర్లు పిలిచామని అన్నారు. రాజధాని అమరావతి అని పార్లమెంటులో ఆల్రెడీ కేంద్రం చెప్పిందని, దానికి అఫీషియల్ గా గెజిట్ కావాలంటే తెప్పిస్తామని నారాయణ చెప్పారు.