నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు: బాలినేని

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందాల ఫైల్ పై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి అన్నారు. అయితే, చంద్రబాబు, పవన్ ల మెప్పు కోసం, పదవుల కోసం బాలినేని తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని చెవిరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. పదవి కోసమే జగన్ పై అభాండాలు వేస్తున్నారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని బాలినేనికి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.

చెవిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గట్టిగా మాట్లాడితే వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు చెవిరెడ్డి రావాలని చెవిరెడ్డికి బాలినేని ప్రతి సవాల్ విసిరారు. రోజు జగన్ కాళ్ళ మీద పడి భజన చేయలేదు కాబట్టే ఈ రోజు వేరే పార్టీకి వచ్చానని అన్నారు. చంద్రబాబును చెవిరెడ్డి తిడతారు కాబట్టి టికెట్ ఇచ్చారని, చెవిరెడ్డి లాగా ఎవరి మెప్పుకోసం తాను ఎప్పుడు పని చేయలేదని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఒప్పందం గురించి చెవిరెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ప్రశ్నించారు.

వైఎస్సార్ పై అభిమానంతో ఎమ్మెల్యే పదవిని వదులుకొని వైసీపీలోకి వెళ్లానని, రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరే కాదని విజయమ్మ, షర్మిల కూడా అని బాలినేని అన్నారు. షర్మిల, విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే ఆ కుటుంబం తనది కాదన్నట్లు పట్టించుకోరా అని బాలినేని ప్రశ్నించారు. తిట్టిన వాళ్లకి టికెట్లు ఇస్తామన్న సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో అందరికీ తెలుసని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

తాను ఎవరినీ విమర్శించని చెప్పానని, కానీ, తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే తాను కూడా వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని బాలినేని హెచ్చరించారు. విద్యుత్ ఒప్పందం అంశంలో తనకే సంబంధం లేదని తాను చెప్పానని అన్నారు, చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుని తెచ్చి ఒంగోలులో ఎంపీ టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. అది నచ్చకే తాను ఆ విషయానికి అంగీకరించలేదని అన్నారు.