కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం ఓటర్లు వరదలా విరుచుకుపడ్డారు. ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకకు ఓట్లు పోటెత్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. గతంలో ఇందిరమ్మ కుటుంబంలో ఎవరికీ రాని ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. “ఇందిరా గాంధీ మనవరాలిగా చెబుతున్నా.. ” అంటూ ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించేశాయి.
తాజాగా కేరళలోని వయనాడ్ పార్లమెంటుస్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ప్రియాంకగాంధీ పోటీ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. అంతేకాదు.. బీజేపీ కూడా బలమైన మహిళా అభ్యర్థికే టికెట్ ఇచ్చింది. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నా కూడా.. సీపీఐ కూడా అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది. మరో 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ఇంత పోటీలోనూ.. ప్రియాంక గాంధీకి ఓట్ల వర్షం కురిసింది.
కడపటి వార్తలు అందే సరికి.. ప్రియాంక గాంధీ.. 4 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకుని ముందుకు సాగుతున్నారు. ఇంకా పలు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి ఉంది. సో.. మొత్తానికి ఇందిరమ్మ మనవరాలికి ప్రజలు తొలి విజయంలోనే భారీ మెజారిటీని కట్టబెట్టడం గమనార్హం. ఈ ఏడాది ఇక్కడ నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. రాయ్‌బరేలీలోనూ ఆయన గెలుపు గుర్రం ఎక్కడంతో రెండు స్థానాల్లో ఒకటి వదులుకున్నారు. ఈ క్రమంలోనే వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates