ఆ ప‌దిమంది ఎమ‌య్యారు… వాయిస్ లేకుండా పోయిందా?

వైసీపీ ఎమ్మెల్యేల‌కు వాయిస్ లేకుండా పోయిందా? ఎక్క‌డా వారు క‌నిపించ‌క‌పోవ‌డానికి తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌య‌మే కార‌ణ‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ విప‌క్షంలో ఉన్న‌ప్పు డు.. ఎమ్మెల్యేలు.. స‌భ‌కు వెళ్లి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేవారు. ఆ త‌ర్వాత‌.. వారే.. బ‌య‌ట‌కు వ‌చ్చి.. మీడియా ముందు నిప్పులు చెరిగేవారు. దీంతో టీడీపీ స‌భ్యుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చేది. వారు ఏం చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలిసేది. మీడియాలో కూడా వ‌చ్చేది.

మ‌రి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమ‌య్యారు? అనేది చూస్తే.. ఎవ‌రికి వారు నిమిత్త మాత్రులుగా ఉండిపోయారు. నిజానికి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇవి ప్రారంభ‌మై కూడా ప‌ది రోజులు అయ్యాయి. ఈ ప‌ది రోజుల కాలంలో స‌భ‌కు వెళ్లలేదు స‌రే. అధినేత గీసిన గీత దాట‌లేదు అనుకుందాం. కానీ, మీడియా ముందుకు అయినా రావాలి క‌దా? అంటే.. ఎక్క‌డా వారు క‌నిపించ‌డం లేదు. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మీడియా ముందుకు రాలేదు. క‌నీసం స‌భ‌ల్లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల గురించి కూడా స్పందించ‌లేదు.

ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే ఇంటి నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. అంత‌కుమించి ఆయ‌న కూడా ఏమీ చేయ‌డం లేదు. ప్ర‌తి విష‌యాన్ని విమ‌ర్శించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. ఎదురు దాడే క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలైనా మీడియా ముందుకు వ‌చ్చి.. వాయిస్ వినిపించాలి క‌దా? అంటే మౌన‌మే స‌మాధానంగా ఉంది. క‌నీసం వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మీడియాతో మాట్లాడ‌డం లేదు.

దీనిని బట్టి పార్టీ హైక‌మాండే వారిని నియంత్రించిందా? లేక‌.. వారే నియంత్ర‌ణ‌కు గుర‌య్యారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. స‌మావేశాల‌కు వెళ్ల‌పోయినా.. ప్ర‌జ‌లు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నార‌నే అంశంపై నిశితంగా చూస్తారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎలా స్పందిస్తారోన‌ని ఎదురు చూస్తారు. కానీ, వైసీపీ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి ఇప్పుడు పీఏసీ స‌హా ఇత‌ర ప‌ద‌వుల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది కాబ‌ట్టి పెద్దిరెడ్డి వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. లేక‌పోతే.. ఇన్ని మాసాలుగా వారి అజా ఎక్క‌డుందో కూడా తెలియ‌డంలేదు.