అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీని వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో మండలిలో వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతలు అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సభ బయట ఓ ఆసక్తికర ఘటన జరిగింది. సభ బయట కనిపించిన బొత్సను పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మండలిలో వైసీపీ సభా పక్ష నేత బొత్స సత్యన్నారాయణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో వాడీ వేడీ సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు జగన్ హయాంలో ఆల్ పార్టీ డెలిగేషన్ ను ఆహ్వానించాలని తాను కోరానని, అయినా వారు స్పందించలేదని పవన్ అన్నారు. అయితే, సింగిల్ గానే తమ పార్టీకి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉందని, కాబట్టి అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం తమకు రాలేదని బొత్స చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఆ వెంటనే ఆ వ్యాఖ్యలకు పవన్ స్పందించారు. ఆ రోజు వైసీపీ సరిగ్గా స్పందించి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పవన్ అన్నాు. ఈ రకంగా ఇద్దరి మధ్య వాడీవేడీ సంభాషణ సభ లోపల జరిగింది. అయితే, సభ బయట మాత్రం ఆ విషయాన్ని పక్కనబెట్టి బొత్సను పవన్ ఆలింగనం చేసుకొని మర్యాదపూర్వకంగా పలకరించిన వైనంపై ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే, పవన్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ కు బొత్సతో సత్సంబంధాలున్నాయని, ఆ క్రమంలోనే పవన్ కు బొత్సతో వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉందని టాక్ ఉంది. ఈ క్రమంలోనే బొత్సను పవన్ ఆలింగనం చేసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates