వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన ప్రముఖ పారిశ్రామిక గౌతం అదానీ లంచాల వ్యవహారంలో జగన్ పాత్ర వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో షర్మిల స్పందిస్తూ.. జగన్ రాజకీయ అవినీతి పరుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచం ఇస్తే.. ఏపీని కూడా తాకట్టు పెడతాడని ఆమె అన్నారు. తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన షర్మిల.. అదానీ వ్యవహారాన్ని వదిలి పెట్టడానికి వీల్లేదన్నారు.
అదానీ నుంచి జగన్.. 1750 కోట్ల రూపాయల మేరకు లంచాలు తీసుకున్నారన్నది నిజమేనని షర్మిల చెప్పారు. అమెరికా ఏజెన్సీలు ఆధారాలతో సహా బయట పెట్టాయని తెలిపారు. అదానీ-జగన్ అక్రమ వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు ఉన్నాయని అమెరికా సంస్థలు చెబుతున్నాయని, అమెరికా ఏజెన్సీలు వెల్లడించే వరకు ఈ అక్రమాలు వెలుగు చూడలేదని తెలిపారు.
జగన్ హయాంలో ఏపీలో అవినీతి పరాకాష్టకు చేరిందని షర్మిల చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల పాలు చేయడంతోపాటు.. అవినీతి మయం కూడా చేశారని దుయ్యబట్టారు. అమెరికా వరకు అవినీతి పాకించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి 2100 కోట్ల వరకు ఉంటుందని అంచనాగా ఉందని షర్మిల తెలిపారు. అధికారం అడ్డు పెట్టుకుని అవినీతి చేయడమే కాకుండా.. పోర్టులను కూడా అదానీకి అప్పనంగా అప్పగించేశారని షర్మిల నిప్పులు చెరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates