వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి విచిత్రంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీలకమైన సమయం లో ఆయన మౌనంగా ఉంటూ.. అవసరంలేని సమయంలో స్పందిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. మండలి ఎన్నికలు వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అయినా.. జగన్ వైపు నుంచి స్పందన రాలేదు. ఎవరినీ ఆయన నిలబెట్టలేదు. ప్రోత్సహించలేదు. మద్దతు కూడా ప్రకటించలేదు.
నిజానికి మండలి కోసం జరుగుతున్న ఎన్నికలకు జగన్ మద్దతు ఇచ్చినా, ఎవరినైనా నిలబెట్టినా అది వేరేగా ఉండేది. ఎందుకంటే.. ఈ ఆరు మాసాల కాలంలో ఏదైనా సింపతిపెరిగి ఉంటే అది ఓట్ల రూపంలో వైసీపీకి మేలు చేసేది. కానీ, జగన్ మాత్రం ఈ గోల్డెన్ ఛాన్స్ వదులుకున్నారు. వాస్తవానికి ఒకరిద్దరు నాయకులు పోటీకి రెడీ అయ్యారు. అయినా..జగన్ మాత్రం కాదన్నారు. దీంతో మండలి ఎన్నికలకు వైసీపీ దూరమైంది.
ఇక, ఇప్పుడు బలం లేకున్నా.. అసెంబ్లీలో పోరాటానికి దిగారు. ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ సహా పీయూసీ (పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ) చైర్మన్ పదవులకు పోటీ చేస్తున్నారు. ఆయా పదవులు దక్కించుకునేందుకు కనీసంలో కనీసం 18 మంది(మొత్తం సభ్యుల్లో 10 శాతం) సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ, ఈ మేరకు వైసీపీకి సభ్యులు లేరు. ప్రస్తుతం ఉన్నది 11 మంది సభ్యులు మాత్రమే. అయినప్పటికీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు.
అలాగే మరికొందరు కూడా పీయూసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేశారు. నిజానికి వీరంతా ఓడిపోతారని తెలిసినా.. జగన్ అత్యుత్సాహం చూపడం గమనార్హం. అయితే.. వైసీపీ నేతల పోటీ కారణంగా అనివార్యం గా ఈ పదవులకు ఎన్నిక నిర్వహించే పరిస్థితి వచ్చింది. దీనివల్ల సభా సమయం వృథా తప్ప.. మరేమీ ఉండబోదని.. నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా పోటీ చేయాల్సిన చోట చేయకుండా.. చేయకూడని చోట చేయడం జగన్ చిత్రమైన మనస్తత్వానికి నిదర్శనంగా ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates