అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా? అయితే.. వెనక్కి అంటే.. గతంలో ఆయన పాలనా కాలంలో చేపట్టిన కీలక ప్రోగ్రాంను చంద్రబాబు తిరిగి ప్రారంభిస్తున్నారు. అప్పట్లో హిట్టయిన సదరు కార్యక్రమం తర్వాత.. మూలన బడింది. ఎవరూ పట్టించుకోలేదు. అంతెందుకు.. చంద్రబాబే మళ్లీ ఆ కార్యక్రమంలో జోలికి పోలేదు. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఆ కార్యక్రమం మారకపోవడం .. మరింత పదును తేలడంతో తిరిగి సదరుకార్యక్రమం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
అదే.. డయల్ యువర్ సీఎం కార్యక్రమం. 1995-2004 మధ్య తొమ్మిదేళ్ల పాటు డయల్ యువర్ సీఎం పేరుతో చంద్రబాబు ప్రజలతో నేరుగా మాట్లాడేవారు. ప్రతి సోమవారం అప్పట్లో ఈ కార్యక్రమం నిర్వహిం చారు. తద్వారా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం స్వయంగా చేసేవారు. దీంతో ప్రజల ఫీడ్ బ్యాక్ తెలుసుకునే అవకాశం కూడా ఆయనకు లభించింది. అదేసమయంలో ముఖ్యమంత్రి తోనే నేరుగా తమ సమస్య చెప్పుకొన్నామన్న సంతృప్తి ప్రజలకు ఉండేది.
ఇక, సీఎం దృష్టికి ప్రజలు తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న భయ భక్తులు అధికారుల్లో ఉండేవి. తద్వారా.. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేవి. అప్పట్లో ఈ కార్యక్రమానికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే.. అప్పట్లో డయల్ యువర్ సీఎం అని పేరు పెడితే.. ఇప్పుడు మీతో మీ సీఎం అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ఈ పేరుతో ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం చంద్రబాబు ప్రజలకు కనెక్ట్ కానున్నారు.
ఇక, మరో కార్యక్రమానికి కూడా చంద్రబాబు ఉత్సాహం చూపిస్తున్నారు. అదే.. 15 రోజులకు ఒకసారి ప్రజలకు వీడియో సందేశాలు ఇవ్వడం. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. అంటే ప్రతి నెల 2 సార్లు అటు పోన్లో ప్రజల సమస్యలు వింటూ.. అదేవిధంగా 2 సార్లు వీడియో సందేశాలతో అప్పటివరకు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడం అనే కాన్సెప్టుతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates