పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పోసాని అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగిన వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై తాను రాజకీయాలకు సంబంధించి ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయబోనని పోసాని షాకింగ్ ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీని పొగ‌డ‌నుని, ఏ పార్టీని విమ‌ర్శించనని పోసాని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తనకు తానుగా తీసుకున్నానని, త‌న‌ను ఎవ‌రూ ఏమీ అన‌లేద‌ని పోసాని క్లారిటీనిచ్చారు. తాను, గతంలో కూడా మంచి రాజకీయ నాయకులను విమర్శించలేదని పోసాని చెప్పారు. ప్రధాని మోదీ, ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ వంటి నేతలను తాను ఒక్క మాట అనలేదని చెప్పారు. అన్ని పార్టీల‌కు స‌పోర్టు చేశాన‌ని, విమ‌ర్శ‌లు చేశాన‌ని తెలిపారు.

నాయకుల గుణగణాలను బట్టి వారిపై విమర్శలు చేశానని, ఇకపై చేయబోనని అన్నారు. అంద‌రి కంటే ఎక్కువ‌గా చంద్ర‌బాబునే ఎక్కువగా పొగిడానని, ఆయన చేసిన మంచి ప‌నుల‌ను ఓ లిస్ట్ కూడా రాసుకున్నాన‌ని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు పొర‌పాట్లు చేసిన‌ప్పుడు విమ‌ర్శించానని అంగీకరించారు. ఇప్పటి నుంచి త‌న తుది శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని చెప్పారు.

అయితే, హఠాత్తుగా రాజకీయాలకు పోసాని గుడ్ బై చెప్పడానికి వైసీపీనే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోసానిపై కేసులు పెడుతున్న క్రమంలో ఆయనకు వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో మద్దతు తెలపలేదని, అందుకే పోసాని రాజకీయాలకు, రాజకీయ విమర్శలకు గుడ్ బై చెప్పారని కొందరు నెటిజన్లు అంటున్నారు.