చంద్ర‌బాబు ప‌ల్లె బాట‌.. ఇప్పుడే ఎందుకు?

ఏపీ సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే ప‌ల్లెబాట‌కు రెడీ అవుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాన‌ని.. అది కూడా గ్రామీణ ప్రాంతాల‌ను చేరుకుంటాన‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌, అభివృద్ధి వంటి విష‌యాల‌ను వివ‌రిస్తాన‌ని చంద్ర‌బాబు స‌భ‌కు వివ‌రించారు. అయితే.. ఎన్నిక‌లు పూర్త‌యి.. కేవ‌లం ఆరు మాసాలు కూడా కాకుండానే చంద్ర‌బాబు ప‌ల్లెబాట ప‌ట్ట‌డంపై చ‌ర్చ సాగుతోంది.

అయితే.. చంద్ర‌బాబు నిర్ణ‌యం వెనుక‌.. రెండు వ్యూహాలు ఉండి ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తు న్నారు. 1) ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా.. అసంతృప్తిని పార‌దోలాల‌న్న‌ది ప్ర‌ధాన వ్యూహం. సూప‌ర్ సిక్స్ హామీల విష‌యంలో ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. మ‌హిళ‌ల‌కు 18 ఏళ్లు నిండిన వారికి నెల‌కు రూ.1500 చొప్పున ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.కానీ, ఇది ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం అన్నారు. ఇది కూడా ప్రారంభం కాలేదు.

అదేస‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల‌కు రూ.20 వేల చొప్పు ఇన్‌పుట్ స‌బ్జిడీ ఇస్తామ‌ని కూడా చెప్పా రు. ఇది కూడా ఇంకా మొద‌లు పెట్ట‌లేదు. ఈ నేప‌థ్యంలో అసంతృప్తి నెల‌కొంది. దీనిని కొంత వ‌ర‌కు త‌గ్గించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న‌ది ఈ ప‌ర్య‌ట‌నకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. 2) ప‌ల్లె బాట చేప‌ట్ట‌డం ద్వారా.. స్థానిక సంస్థ‌ల్లో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న సంక‌ల్పం కూడా క‌నిపిస్తోందని అంటున్నారు.

వ‌చ్చే ఏడాది చివ‌రిలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యానికి పార్టీని పుంజుకునేలా చేయాల‌న్న వ్యూహంతో చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ప‌ల్లె బాట ద్వారా.. స్థానికంగా బ‌లోపేతం కావాల‌న్న వ్యూహం ఉంది. ఇక‌, త‌మ్ముళ్ల దూకుడుకు కూడా ఆయ‌న క‌ళ్లెం వేసేందుకు, క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోందో తెలుసుకునేందుకు కూడా ఈ ప‌ల్లెబాట కార్య‌క్ర‌మాలు ప్ర‌యోజ‌నక‌రంగా ఉంటాయ‌న్న‌ది త‌మ్ముళ్లు చెబుతున్న మాట‌.