జ‌గ‌న్ జ‌ట్టులో క‌ల‌వ‌రం.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ జ‌ట్టులో క‌ల‌వ‌రం పెరిగిపోయిందా? నేత‌ల నుంచి అధికారుల వ‌ర‌కు అంద‌రూ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఎత్తి చూపిస్తున్నారు. అంతే కాదు.. అధికారుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. టార్గెట్ అవుతున్నారు. అయితే.. ఇదేదో కొన్ని రోజులు ఉంటుంద‌ని అనుకున్నా.. త‌ర్వాత‌.. కూడా కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌నుల శాఖ అప్ప‌టి డైరెక్ట‌ర్ వెంక‌ట రెడ్డిని అరెస్టు చేయ‌డంతో ప్రారంభ‌మైన ఉన్న‌తాధికారుల అరెస్టులు.. ఇంకా కొన‌సాగుతున్నాయి. ఆయ‌న తాజాగా 50 రోజుల పాటు జైలు జీవితాన్ని పూర్తి చేసుకుని బ‌యట‌కు వ‌చ్చారు.

ఇక ఇప్పుడు సీఐడీ అప్ప‌టి చీఫ్ సంజయ్ టార్గెట్‌గా ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. త్వ‌ర‌లోనే ఈయ‌న‌పైనా స్కిల్ కేసు స‌హా.. ఇత‌ర కేసుల‌ను తిర‌గ‌దోడేందుకు స‌ర్కారు రెడీ అయింది. ఈ ప‌రిణామం వైసీపీని తీవ్రంగా కుదిపేస్తోంది.

ఇదిలావుంటే.. సినీ రంగం ప‌రంగా జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచిన న‌టులు, ద‌ర్శ‌కుల విష‌యం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. రామ్‌గోపాల్ వ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి వంటివారికి ఇప్పుడు ఇబ్బందులు ప్రారంభ‌మ‌య్యాయి.

వ‌ర్మ‌ను అరెస్టు చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయ‌న ముంద‌స్తు ర‌క్ష‌ణ కోసం హైకోర్టును ఆశ్ర‌యించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇక‌, పోసాని ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొంద‌రు న‌టుల‌పై కేసులు కూడా న‌మోద‌య్యాయి.

ఇక‌, సోష‌ల్ మీడియా కేసులు మ‌రింత‌గా వైసీపీకి ఇబ్బంది పెడుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రిని అరెస్టు చేస్తారో తెలియ‌ని ప‌రిస్తితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే అరెస్ట‌యి జైల్లో ఉన్న‌వారిపై మ‌రిన్ని కేసులు పెడుతు న్నారు. ఇవ‌న్నీ ఆధారాలు ఉన్న‌వే కావ‌డంతో వైసీపీ అధిష్టానం కూడా ఏమీ మాట్లాడ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ జట్టుగా ఉంటూ.. అన్ని వైపుల నుంచి ఆయ‌న‌ను\, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థించిన వారు ఇప్పుడు అరెస్టు కాబోతుండ‌డం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.