జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ట్రోల్స్‌కు ఛాన్స్ ఇస్తున్నారా? సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్స్ చేసేలా దొరికిపోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. షోలాపూర్, పుణే తదితర ప్రాంతాల్లో పవన్ రోడ్ షో నిర్వహించడంతోపాటు బీజేపీ తరఫున ప్రచారాన్ని దంచికొడుతున్నారు.
అయితే.. ఈ సందర్భంగా పవన్ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాకు స్టఫ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తనను తాను హైప్ చేసుకునే క్రమంలో పవన్ చేస్తున్న కామెంట్లు.. చర్చకు దారితీస్తున్నాయి. తన పిల్లలతో తాను మరాఠీలోనే మాట్లాడతానని పవన్ చేసిన వ్యాఖ్య ట్రోల్స్‌కు దారితీసింది. సహజంగా ఎవరైనా.. తమ స్వభాషతోనే ఇంట్లో మాట్లాడతారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన భాష వచ్చినా.. దానిని అవసరం, అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వాడతారు.
పవన్ మాత్రం.. తను తన పిల్లలతో ఇంట్లో మరాఠీలోనే మాట్లాడతానని, తాను మరాఠీ కూడా చదువుకున్నానని చెప్పుకురావడం..ఆశ్చర్యానికి దారి తీసింది. ఇక, ఇదేసమయంలో పుణేలో ఒకప్పుడు తమకు ఇల్లు ఉండేదని పవన్ వ్యాఖ్యానించారు. కానీ, గతంలో ఆయన ఎన్నికల ప్రచార సమయంలో తమకు చిన్నప్పుడు ఒకే ఒక్క ఇల్లు ఉండేదని.. కొన్నాళ్లు నెల్లూరులో ఉన్నామని చెప్పుకొచ్చారు. పోనీ.. తాను సినీరంగంలోకి వచ్చాక ఏమైనా పుణేలో ఇల్లు కొన్నారేమో.. అనుకున్నా.. అదికూడా ఎప్పుడూ ఆయన చెప్పలేదు.
కానీ, తాజాగా మహారాష్ట్ర ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు.. పుణేలో ఒకప్పుడు ఇల్లు ఉండేదని.. ఇక్కడే తాము నివసించేవారమని చెప్పుకొచ్చారు. ఇది కూడా ట్రోలర్స్‌కు భారీ స్టఫ్ ఇచ్చేసింది. ఇక, సనాతన ధర్మానికి ఇబ్బంది వస్తే.. తాను సహించేది లేదన్నారు. తాను అడ్డు పడతానని కూడా తెలిపారు. వీటిపైనా కామెంట్లు కురుస్తున్నాయి. మహారాష్ట్ర ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ వైపు ప్రజలు చూసేలా పవన్ అడుగులు వేస్తున్నా.. అవి ట్రోల్స్‌కు అవకాశం ఇస్తుండడం గమనార్హం.