బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్డీఏకి ఎల్జేపీ పెద్ద షాకే ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమితో కలిసి పోటి చేయటానికి తమకు ఇష్టం లేదని లోక్ జనశక్తిపార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చిరాగ్ తండ్రి, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్న సమయంలో చిరాగ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 243 అసెబ్లీ సీట్లున్న బీహార్ లో తమ పార్టీ ఒంటరిగానే 143 సీట్లలో పోటి చేస్తుందని చిరాగ్ ప్రకటించారు.
చాలా కాలంగా చిరాగ్ కు నితీష్ కు మధ్య బాగా గొడవలవుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వివాదాలు రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో బీజేపి నేతృత్వంలో కలిసి పనిచేస్తామని చెబుతునే మళ్ళీ నితీష్ నాయకత్వాన్ని మాత్రం అంగీకరించేది లేదని చెబుతుండటం విచిత్రంగా ఉంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుండి ఎల్జేపీ పక్కకు వెళ్ళిపోతే ముందు నష్టపోయేది బీజేపినే అన్న విషయం అందరికీ తెలిసిందే. నితీష్ నేతృత్వంలోని జేడియు బలంగానే ఉంది. అలాగే ఎల్జేపీ కూడా బలమైన నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంది. ఎటుతిరిగి బలహీనంగా ఉన్నది బీజేపీ మాత్రమే.
ఎన్నికల నగారా మోగిన తర్వాత నితీష్-చిరాగ్ మధ్య సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు జరిగాయి. సమస్యలు కూడా పరిష్కారమయ్యాయనే అందురు అనుకున్నారు. కానీ ఇంతలోనే వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో చిరాగ్ ఏకపక్ష ప్రకటన చేయటంతో అందరిలోను టెన్షన్ మొదలైంది. ఈ ఎన్నికల్లో తమ నినాదమైన బీహారీ ఫస్ట్-బీహార్ ఫస్ట్ అనే అంశం జేడియు తో కలిసి పోటి చేస్తే సాధ్యం కాదని చిరాగ్ చెప్పటం పట్ల అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చిరాగ్ అయినా నితీష్ అయినా బీహారీలే. మరి నితీష్ తో సమస్య ఏమిటంటే ప్రత్యేకించి రాజకీయ ఆధిపత్యం కోసమే చిరాగ్ పావులు కదుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.
మొత్తానికి యూపీఏ కూటమిలోని ఆర్జేడీ కూడా 243 సీట్లలో 143 సీట్లకు పోటి చేస్తోంది. కాంగ్రెస్ కు 70 స్ధానాలు కేటాయించారు. మిగిలిన మూడు పార్టీలకు తలా నాలుగైదు సీట్లు కేటాయించారు. ఈ కూటమిలో సీట్ల కేటాయింపులో ఎటువంటి సమస్యలు ఉన్నట్లు లేదు. ఎందుకంటే పార్టీల నేతలంతా కలిసి సమావేశం జరిపిన తర్వాత సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేశారు. మరి ఇదే సమస్య ఎన్డీఏ కూటమిలో సాధ్యం కాలేదు. మరి ఎన్డీఏ కూటమిలోని పార్టీలు దేనికదే విడిపోతే ప్రత్యర్ధులే లాభపడతారన్న విషయం తెలీదా ? చూద్దాం ఎన్నికల ముంగిట ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో.