ఏపీకి గోల్డెన్ ఛాన్స్.. ఒకేసారి 6 ఎయిర్‌పోర్టులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో వైమానిక పరివహనానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపాదనల కోసం రూ.1.92 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో సాధ్యత అధ్యయనం ప్రారంభించి, నివేదికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనాలు కలిగించే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు.

చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంతో పాటు, శ్రీకాకుళం (పలాస), నాగార్జునసాగర్‌ సమీపంలో, తుని అన్నవరం తాడేపల్లిగూడెం, ఒంగోలు, ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్ సమీపంలో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 1,383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాల భూమిని అధికారుల టీమ్ గుర్తించింది.

ఈ ప్రాంతాలు రాష్ట్రంలో వైమానిక పరివహనానికి కీలక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేలా సాధ్యత అధ్యయనం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం గమనార్హం. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అనుమతులు పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం అయితే ఇలాంటి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది.

ఇక ప్రతిపాదిత ప్రాంతాల ఆధారంగా, ఈ ఎయిర్‌పోర్టులు కార్గో సేవలకు, రీజనల్ కనెక్టివిటీకి ప్రాధాన్యతనివ్వనున్నాయి. ఎయిర్‌పోర్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత, రాష్ట్రం వ్యాప్తంగా ప్రయాణికుల సౌలభ్యం, వ్యాపార వృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. కేవలం రవాణా అవసరాలకే కాకుండా, ఈ ఎయిర్‌పోర్టులు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం ఇస్తాయని, పర్యాటక రంగానికి పునాది వేస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న కొద్ది ఎయిర్‌పోర్టులు మాత్రమే పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నాయి. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ వైమానిక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరి కూటమి ప్రభుత్వం హయాంలో ఈ పనులు ఎంత వేగంగా కొనసాగుతాయో చూడాలి.