కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కార‌ణాలు ఏవైనా.. నాయ‌కులు మాత్రం నిప్పులు చెరుక్కుంటు న్నారు. కూట‌మి నేత‌లు త‌మ ప‌దవులు త‌న్నుకు పోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు, టీడీపీ నాయ‌కుల వ‌ల్లే త‌మ‌కు పద‌వులు రాకుండా ఉంటున్నాయ‌ని ఇత‌ర పార్టీల నాయ‌కులు ఉసూరు మంటున్నారు. దీంతో క‌లివిడి క‌న్నా విడివిడి రాజ‌కీయాలే ఏపీలో క్షేత్ర‌స్థాయిలో క‌నిపిస్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో అంద‌రూ క‌లిసిమెలిసి ఉండాల‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు పదే ప‌దే చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు త‌మ్ముళ్లు మాత్రం ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఖ‌చ్చితంగా ఇలాంటి స‌మ‌యంలోనే చంద్ర‌బాబు జాతీయ వేదిక‌గా.. బీజేపీ+టీడీపీ+జ‌న‌సేన కూట‌మిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఎలాంటి ప‌నులు చేసినా.. తాము మాత్రం క‌లిసే ముందుకు సాగుతామ‌న్నారు.

కూట‌మి పార్టీలుగా భ‌విష్య‌త్తుపై ఎంతో ఉత్సాహంతో ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు. తాము వ‌చ్చే 2029 లేదా జ‌మిలి ఎన్నిక‌లు ఏది వ‌చ్చినా.. క‌లివిడిగానే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని తేల్చి చెప్పారు. “మ‌మ్మ‌ల్ని విడ‌దీసేందుకు అనేక మంది ప్ర‌య‌త్నం చేస్తుండ‌వ‌చ్చు. కానీ, మేం మాత్రం క‌లిసే ఉన్నాం. క‌లిసే ముందుకు సాగుతాం. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు“ అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

దీంతో క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు-ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు ప‌రోక్షంగా చంద్ర‌బాబు క‌లివిడి రాజ‌కీయాల పై స్ప‌ష్టత ఇచ్చారు. దీనిపై వారే తేల్చుకోవాల్సి ఉంటుంది. ప్ర‌ధాన పార్టీలు మాత్రం క‌లిసిమెలిసే రాజ‌కీయాలు చేసుకుంటాయ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్దలు కొట్టారు. సో.. దీనిని బ‌ట్టి.. క్షేత్ర‌స్థాయిలోనూ నాయ‌కులు క‌లిసి మెలిసి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. వారే మారిపోయే ప‌రిస్థితి ఎదురు కావ‌డం త‌థ్యం. మ‌రి త‌మ్ముళ్లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోచూడాలి.