రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌… రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిందుత్వం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చాటుకుంటూ `సిద్ధాంత‌ప‌ర‌మైన` ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డంలో ఆయ‌న ముందుంటారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్‌. వరుసగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్ జాడ ఏద‌ని ఇప్పుడు బీజేపీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది, తాజాగా మ‌రో అంశంలో ఆయ‌న పేరు కీల‌కంగా వినిపిస్తోంది.

హైదరాబాద్‌లో పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గుర్తింపు పొంద‌డ‌మే కాకుండా సిద్ధాంత‌ప‌ర‌మైన ప్ర‌త్య‌ర్థి అయిన ఎంఐఎంపై ఒంటికాలిపై లేవ‌డంలో రాజాసింగ్ ప్ర‌త్యేక‌త‌ను సాధించారు. అయితే, రాజాసింగ్‌ను పార్టీలో ప‌క్క‌న పెడుతున్న‌ట్లు ఆయ‌న సానుభూతిప‌రులు వాపోతున్నారు. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా బీజేపీ చేప‌డుతున్న పార్టీ కార్య‌క్ర‌మం. మూసీ ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాల్లో ఇండ్లను ప్రభుత్వం కూల్చేయటాన్ని త‌ప్పుప‌డుతున్న బీజేపీ… ఇందుకు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లో రాజాసింగ్‌కు చోటు క‌ల్పించ‌లేదు. పేదల ఇండ్లను ప్రభుత్వం కూల్చటాన్ని నిర‌సిస్తూ బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే, ఇందులో మ‌ళ్లీ రాజాసింగ్ పేరు గాయాబ్ అయింది!

బ‌స్తీ నిద్ర ప్ర‌ణాళిక‌లో భాగంగా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్న బీజేపీ బోడుప్పల్‌ నుంచి పాతబస్తీ వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 చోట్లను ఎంపిక చేసింది. బీజేపీ నేతలు ఈనెల‌16న  ఆ ప్రాంతాల్లోకి వెళ్లి స్థానికులతో రచ్చబండ నిర్వహిస్తారు. దీంతోపాటుగా బాధితుల ఇండ్లలోనే భోజనం చేసి అక్కడే నిద్రించనున్నారు. ఇందుకోసం 20 ప్రాంతాల్లో పాల్గొనే ముఖ్య నేతల పేర్లనూ ప్రకటించింది. అందులో రాజాసింగ్ పేరు లేదు!హైదరాబాద్‌లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండ‌ట‌మే కాకుండా ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన‌ రాజాసింగ్‌కు చోటు దక్కక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బీజేపీ చేప‌ట్టిన ఈ కీల‌క‌మైన కార్యాచ‌ర‌ణ‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం… బ‌స్తీ నిద్ర‌లో భాగంగా పాల్గొనే నేత‌ల్లో ఇతర జిల్లాలకు చెందిన నేతలకు చోటిచ్చిన బీజేపీ పెద్ద‌లు… మూడు సార్లు నెగ్గిన ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు మాత్రం చాన్స్ ఎందుకివ్వలేదనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప‌రిణామంపై మ‌రో చ‌ర్చ వినిపిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, రాజాసింగ్‌కు అస్సలు పొసగటం లేద‌ని… అందుకే ఆయ‌న‌కు 

చాన్స్ ఇవ్వ‌డం లేద‌ని అంటున్నారు. మొత్తంగా రాజాసింగ్ సైడ్ అవుతున్న‌ టాపిక్‌… ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ అయింది.