మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా వికాస్ అఘాడీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమ తమ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మిత్రపక్ష నేతలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పాల్గొన్నారు.
బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ రక్షణ కోసమే శివసేన, జనసేన ఆవిర్భవించాయని పవన్ చెప్పారు. శివాజీ మహరాజ్ పుట్టిన గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని, జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన, శివసేనల సిద్ధాంతమని అన్నారు. బాల్ ఠాక్రే నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయని తెలిపారు.
ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాల్ ఠాక్రే కోరుకున్నారని, ఆయన కలలుగన్న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ నిర్మించి చూపారని చెప్పారు. దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నామని, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా? అని ప్రజలను ప్రశ్నించారు. విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేదా కలిసి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామా? అని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates