పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యారు. తర్వాత.. ఆయ నపై వైసీపీ వేటు వేసినా.. మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఇక, ఆతర్వాత ఏపీ ఫైర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పూనూరు పనిచేశారు. ఇప్పుడు తాజాగా ఆయన పరారీలో ఉండడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం విజయవాడ, ముత్యాలంపాడులో ఒక పెద్ద కార్యాలయాన్ని పూనూరు గౌతంరెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఆఫీసు ఉన్న భూమి గౌతంరెడ్డిది కాదని.. తప్పుడు పత్రాలతో ఆక్రమించారనేది పూనూరుపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ఈ భూమి ఓనర్ అయిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్నారు. కేసు విచారణ పరిధిలో ఉంది. అయితే.. ఇంతలోనే గౌతంరెడ్డి ఉమామహేశ్వరశాస్త్రిని చంపించేందుకు కుట్ర పన్నారనేది తాజాగా నమోదైన కేసు.
ఈ క్రమంలో స్థల యజమాని గండూరి ఉమామహేశ్వరశాస్త్రిపై ఇటీవల దాడి కూడా జరిగిన విషయం చర్చకు వస్తోంది. ఈ దాడి వెనుక పూనూరు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. గండూరిని లేపేయడం ద్వారా రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్థిని సొంతం చేసుకునేందుకు పూనూరు ప్లాన్ చేశారన్న అభియోగం కూడా నమోదైంది. గండూరి హత్యకు సుమారు రూ.25 లక్షల సుపారీకి డీల్ కుదుర్చుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే.. ఆది నుంచి వివాదాలకుకేంద్రంగా ఉన్న గౌతంరెడ్డిపై చాలానే కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆరుగురు నిందితుల పేర్లను చేర్చారు. గండూరి హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిలో ఏ1గా పూనూరు గౌతంరెడ్డి పేరు చేర్చారు. ఇదిలావుంటే.. గౌతంరెడ్డిని వైసీపీ నాయకులే కాపాడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూనూరు.. కడపలో గానీ, నెల్లూరులో గానీ ఉండొచ్చని చెబుతున్నారు. గౌతం రెడ్డిని అరెస్టు చేసేందుకు వేట సాగిస్తున్నారు.