టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో టీడీపీ అభిమాని చెప్పిన మాట కాదు. వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తున్న మాట. ఒకప్పుడు వైసీపీ నాయకులు నారా లోకేష్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. ఆయనకు మాట్లాడడం కూడా రాదని ఎద్దేవా చేశారు. అలాంటి వారే ఇప్పుడు ఒకటికి రెండు సార్లు అసెంబ్లీలో నారా లోకేష్ ప్రసంగాలను వినడం.. లైక్ చేయడం గమనార్హం.
తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో నారా లోకేష్ మాట్లాడుతున్న తీరును అందరూ వినసొంగు ఉం దని మెచ్చుకుంటున్నారు. సబ్జెక్టు విషయంలో పక్కా లెక్కలతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కారుపై నిశిత విమర్శలు చేస్తూ..చురకలు అంటిస్తున్న తీరును విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతూ.. నారా లోకేష్ దాదాపు 15 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆసాంతం వినసొంపుగా ఉండడం గమనార్హం.
గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టులను చెబుతూ.. ఆయన అనేక ఉదాహరణలు వివరించారు. అనంతపురంలో కియా, చిత్తూరులో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ వంటివి తీసుకు వచ్చామని గణాంకాల సయితంగా వివరించారు. ఇదేసమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఈ క్రమంలోనేకరువు పీడిత జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేశామన్నారు. అయితే.. చివరిలో మాత్రం అభివృద్ధి అంటే.. రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కట్టుకోవడం కాదంటూ.. జగన్‌కు చురకలు అంటించారు.
ఈ విమర్శలోనూ ఎక్కడా ఎలాంటి అనుచిత సంభాషణ చేయకుండా.. చాలా నిర్మాణాత్మక విమర్శలు చేయడం విమర్శకులను కూడా కట్టిపడేసింది. గతంలోనూ నారా లోకేష్ అనేక సందర్భాల్లో సభల్లో ప్రసంగించారు. కానీ, ఇలా ఎప్పుడూ ఆయన ప్రసంగించలేదు. ఒకరకంగా అప్పట్లో ఆయన పదాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని.. వైసీపీ నాయకులు విమర్శించేవారు.కానీ, ఇప్పుడు మాత్రం వారే మెచ్చుకునే స్థాయిలో నారా లోకేష్ ప్రసంగాలు ఉండడంతో ఎవరూ విమర్శించే సాహసం చేయకపోవడం గమనార్హం.