ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ రఘురామను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. అనంతరం సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్…రఘురామను గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు గురించి సభలో ప్రస్తావించారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని పవన్ అన్నారు.
కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, నరసాపురంలో రఘురామను అడుగుపెట్టనివ్వమని చెప్పిన వారు ఈరోజు సభలో అడుగుపెట్టే పరిస్థితి లేదని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అధికార పార్టీ సభ్యులను ఎదుర్కోవాలంటే వైసీపీ సభ్యులకు భయం కలుగుతుందని చెప్పారు. చంద్రబాబును కూడా గతంలో ఇబ్బందులు పాలు చేశారని, అప్పుడు తాను ఎంతో ఆవేదన చెందానని పవన్ అన్నారు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు రాజ్యాన్ని ఏలితే ఎవరినైనా బలి చేస్తారని పవన్ చెప్పారు. అలాంటి పాలిటిక్స్ ఉండకూడదని 2014లో 2024లో వారిని నిలువరించామని, 2019లో కుదరలేదని అన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిలు, సొంత పార్టీ నేతలు ఎవరినీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వదలలేదని పవన్ అన్నారు. రఘురామను శారీరకంగా, మానసికంగా హింసించారని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన కోరిక వల్లే ఈరోజు డిప్యూటీ స్పీకర్గా రఘురామను చూడగలుగుతున్నామని పవన్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. రఘురామ తన సెన్సాఫ్ హ్యూమర్ కోల్పోకూడదని, ప్రజాస్వామ్య విలువలను సైతం కాపాడాలని అన్నారు.
చట్టసభల్లో హుందాతనం పోయిందని, అందుకే ఇళ్లల్లోకి వచ్చి రేప్ లు చేస్తామని వ్యాఖ్యానిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూజింగ్ ని ఆపేందుకు సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సాధ్యమైనంత త్వరలో తీసుకురావాలని అనుకుంటున్నట్లుగా పవన్ చెప్పారు. హాస్య చతురత కోల్పోకుండానే సభా విలువలను రఘురామ నెలకొల్పుతారని తాను ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates