వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు వైసీపీకి కొరకరాని కొయ్యగా ఉన్నా రఘురామ 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రఘురామకు వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
గతం గతహా: అన్న విజయసాయిరెడ్డి అన్నీ మరచిపోయి ముందుకుపోవాలని రఘురామకు హితవు పలికారు. డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందని సాయిరెడ్డి చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నానని అన్నారు. వైసీపీ నేతలను, విజయసాయిని, జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన రఘురామకు విజయసాయి విషెస్ చెప్పడం షాకింగ్ గా మారింది.
ఉప్పు, నిప్పులా వైసీపీ నేతలు, రఘురామ ఉంటున్న తరుణంలో సాయిరెడ్డి ఈ తరహా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ కు గురయ్యానని స్వయంగా రఘురామ పలు సందర్భాల్లో వెల్లడించారు. రఘురామతో కాంప్రమైజ్ కు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గతంలో రఘురామను అంత టార్చర్ చేసి మరచిపోమంటే ఎలా కుదురుతుంది అని ట్రోల్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates