జగన్ కు కౌంటర్ ఇవ్వడంలో షర్మిల స్పీడ్

అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు ఏపీపీసీసీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 1.7 శాతం ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని షర్మిల వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కు తాజాగా షర్మిల మరోసారి కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీకి వెళ్లని పక్షంలో జగన్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ కు 1.7 శాతం ఓట్లు వచ్చినా ఈ రెండు పార్టీలకు పెద్ద తేడా లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందు స్పందించింది తానేనని గుర్తు చేశారు. 38 శాతం ఓట్ షేర్ ఉన్నా అసెంబ్లీకి పోకుండా వైసీపీని ఒక “ఇన్ సిగ్నిఫికెంట్” పార్టీగా మార్చింది జగన్ అని చురకలంటించారు.

అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల కోసం పోరాడకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థ పార్టీగా వైసీపీ మిగిలిందని విమర్శించారు. అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ” వైసీపీకి ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని చురకలంటించారు. సొంత మైకుల ముందు అసెంబ్లీ పెట్టడం కాదని, అసెంబ్లీకి వెళ్లి అక్కడ మైకుల ముందు మాట్లాడాలని అన్నారు.

ప్రతిపక్ష హోదా లేకున్నా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాపక్షం అనిపించుకోవాలని. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని, ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఏ పార్టీ ఇన్ సిగ్నిఫికెంట్.. ఏ పార్టీ ఇంపార్టెంట్ అన్న విషయం తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే…దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బీజేపీ నేతలను సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలని డిమాండ్ చేశారు.