ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు వచ్చాయి. ఇది ప్రజారంజక బడ్జెట్ అని కూటమి పార్టీల నేతలు చెబుతుంటే వైసీపీ నేతలు మాత్రం ఈ బడ్జెట్ విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్ పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
ఈ బడ్జెట్ చూస్తే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అన్న విషయం అర్థం అవుతోందని జగన్ సెటైర్లు వేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా మోసగించిన విషయం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే బడ్జెట్ ప్రవేశపెట్టకుండా జాప్యం చేశారని ఆరోపించారు. తన హయాంలో ఏపీ అప్పులు శ్రీలంకను మించిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేశారని. దత్తపుత్రుడితో కూడా ఇదే విషయం మాట్లాడించారని చెప్పారు.
ఏపీకి 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఎన్నికలకు ముందు ప్రచారం చేశారని, అవే అబద్దాలను గవర్నర్ తో కూడా చెప్పించారని జగన్ అన్నారు. కానీ, తాజాగా బడ్జెట్ లో 6.46 లక్షల కోట్ల అప్పుల మాత్రమే చూపించారని జగన్ వెల్లడించారు. 2019లో తాను అధికారం చేపట్టినప్పుడు 3.13 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని, తాను దిగిపోయే నాటికి 6.46 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని చెప్పారు. చంద్రబాబు హయాంలో అప్పులు 19% పెరిగాయని, తన హయాంలో 15% మాత్రమే పెరిగాయని జగన్ అన్నారు.
కాబట్టి చంద్రబాబుకు అప్పురత్న పురస్కారం ఇవ్వాలని చురకలంటించారు. సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టేందుకే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు 17వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు వసూలు చేశారని, ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు చేసిన నిర్వాకం ఇదని విమర్శించారు.