వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై కూటమి నేతలు వర్సెస్ వైసీపీ అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ప్రభుత్వం అండతో నోటికి వచ్చినట్లు పోస్టులు పెట్టడంతోనే వారిని ఇప్పుడు చట్ట ప్రకారం అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారని, అటువంటి పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సూపర్ సిక్స్ అమలుకు కావాల్సిన నిధులకు, వాటి కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతనే లేదని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.
అంతేకాదు, చంద్రబాబు మోసాలపై తాను కూడా ట్వీట్ చేస్తానని, వైసీపీ నేతలు, కార్యకర్తలూ అందపూ ట్వీట్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో ఈ మోసం గురించి ప్రచారం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.
ఎంతమందిపై ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, అరెస్టు చేయాలంటే నాతోనే మొదలుబెట్టండి అంటూ జగన్ సవాల్ విసిరారు. అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు…జగన్ పై ఆ నెపం నెడుతున్నారని, బాధగా ఉందంటూ దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ నటనకు మించి నటిస్తున్నారని సెటైర్లు వేశారు.
చంద్రబాబు యాక్షన్ ముందు ఎన్టీఆర్ నటన నథింగ్ అని చురకలంటించారు. అసెంబ్లీ జరిగినంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని జగన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates