అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు బర్నింగ్ టాపిక్ లపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ క్రమంలోనే జగన్ పై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో షైతాన్ సైన్యాన్ని జగన్ పెంచి పోషించారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగనన్న తల్లి, చెల్లి అని కూడా చూడకుండా తనపై, విజయమ్మపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దూషణలకు దిగారని షర్మిల ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై సోషల్ మీడియాలో విమర్శలు చేయమని జగన్ ప్రోత్సహించి ఉంటారని షర్మిల అభిప్రాయపడ్డారు. మొరుసుపల్లి షర్మిల అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు విమర్శించిన నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆయన స్వయంకృతాపరాధమని షర్మిల అన్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు ఈ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే ఇచ్చారని, ఆ 11 మందిని గెలిపించిన కృతజ్ఞత కూడా జగన్ కు లేదని అన్నారు. ఆ 11 మంది అయినా శాసనసభకు వచ్చి ప్రజల తరఫున ప్రశ్నించాలి కదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళని జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతుందని…అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్థ్యం జగన్ కు లేవా అని షర్మిల ప్రశ్నించారు. తన ప్రశ్నలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సభకు వెళ్లకపోవడం అంటే తమను గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలకు కూడా వైసీపీ సభ్యులు హాజరు కాలేదని, అసెంబ్లీకి వెళ్లకుంటే జగన్, వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.
ఇక, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వంచన బడ్జెట్ అని షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు దాదాపు 1.20 లక్షల కోట్లు కావాలని అంచనా ఉందని, అందులో పావు వంతు కూడా కేటాయింపులు జరగలేదని షర్మిల ఆరోపించారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని బడ్జెట్లో కేటాయింపులు జరపలేదని, తల్లికి వందనం పథకం కోసం 12 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా 2400 కోట్లు కేటాయించారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదని, నిరుద్యోగ భృతి కింద కూడా కేటాయింపులు జరగలేదని షర్మిల ఆరోపించారు. ఓట్ల కోసమే వాగ్దానాలు చేశారని, ఇది ప్రజల బడ్జెట్ కాదని షర్మిల విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates