ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు తొలిరోజు బడ్జెట్ ప్రసంగంతో ప్రశాంతంగా సాగిపోయాయి. అయితే.. ఈసమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ సహా ఇతర సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. ఈ పరిణామంపై సర్వత్రా విమర్శలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా మీడియా ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో ఆయన స్పందిస్తూ.. ఎవరి కోసమూ సభలను వాయిదా వేయలేమన్నారు. సభలు సజావుగా సాగిపోతాయన్నారు.
ప్రజల కావాలనుకునేవారు, ప్రజల సమస్యలపై మాట్లాడాలనుకునేవారు సభలకు వస్తారు. ఎవరు వచ్చినా.. ఎవరు రాకపోయినా.. సభలను మాత్రం నిర్వహిస్తాం. గతంలో 2014-19 మధ్యకూడా వైసీపీ సభలకు రాకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరించింది. దీంతో అప్పట్లో మేమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాం. మా ఎమ్మెల్యేలే ప్రజల తరఫున సభలో సమస్యలను లేవనెత్తారు. మాకు ప్రజల సమస్యలు కొత్త కాదు. ప్రజల తరఫున మాట్లాడడం కూడా కొత్త కాదు. వైసీపీ వస్తే.. వారికి అవకాశం స్పీకర్ ఇస్తారు. మాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఒకవేళ రాకపోతే.. ఆ పాత్ర కూడా మేమే నిర్వహిస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సభలకు హాజరయ్యేలా అందరూ కోరుతున్నారని… ప్రజలు ఏదో ఇవ్వాలని కోరుకోవడం, దాని కోసం అలగడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. గతంలో తమకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రతి సభకూ హాజరైన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తాను మాట్లాడేందుకు లేచినా.. తనకు కూడా మైకు ఇవ్వలేదన్నారు. అయినా.. తాను ఓపికగా సభకు వెళ్లానని తెలిపారు. సభకు రావడం అనేది ప్రజాప్రతినిధి కర్తవ్యమని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశామని, సభలో ఉన్న ప్రతి ఒక్కరూ.. ప్రజల తరఫున మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందన్నారు. ఈ విషయంలో తాము ఎంత వరకు పాత్ర పోషించాలో అంత వరకు పోషిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.