ఏపీలో టాటా పెట్టుబ‌డులు ఇవే..

ఏపీలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేలా.. సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047 మంత్రాన్ని జ‌పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయ‌న విజ‌న్‌-2047 టాస్క్‌ఫోర్స్‌ను రెండు వారాల కిందటే ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి సీఎం చంద్ర‌బాబు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌హ చైర్మ‌న్‌గా టాటాగ్రూప్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ క‌మిటీ.. సోమ‌వారం సాయంత్రి అమ‌రావ‌తిలో భేటీ అయింది. ఈ భేటీకి ప‌లువురు పారిశ్రామిక దిగ్గ‌జాలు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఐదేళ్ల‌లో రాష్ట్రంలో చేప‌ట్టాల్సిన ప్రాజెక్టులు, పారిశ్రామికంగా చేయాల్సిన అభివృద్ధిని చ‌ర్చించారు.

విజన్-2047పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తొలి సమావేశంలో ఇదే కావ‌డంతో చైర్మ‌న్‌గా సీఎం చంద్ర‌బాబు ప‌లు సూచ‌న‌లు చేశారు. పారిశ్రామికంగా ఐటీ ప‌రంగా రాష్ట్రంలో చేప‌ట్టే ప్రాజెక్టుల‌ను ఆయ‌న వివ‌రించారు. అదేవిధంగా ఆయా రంగాల్లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను కూడా వివ‌రించారు. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న దిశ‌గా ప్ర‌భుత్వం చేప‌డుతున్న పాల‌సీల‌ను వివ‌రించారు.  సాంకేతిక రంగం మ‌రింత అడ్వాన్స్‌గా ఉన్న నేప‌థ్యంలో దీనిని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ముఖ్యంగా యువ‌త‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డం ద్వారా తిరుగులేని ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చన్నారు.

రాష్ట్రంలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, జాతీయ ర‌హ‌దారులు, తీర ప్రాంతం, ఎయిర్ పోర్టులు ఉన్నాయని చంద్ర‌బాబు వివ‌రించారు. అదేస‌మ‌యంలో కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు రాష్ట్రం వేదిక‌గా మారుతోంద న్నారు. ఒక‌ప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటే.. ప్ర‌స్తుతం తాము `స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్` దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. ప్ర‌తి ఇంటి నుంచి ఒక ప్రొఫెష‌న‌ల్ ఉండాల‌నేది త‌మ ల‌క్ష్యంగా వివ‌రించారు. అదేస‌మ‌యంలో ప్ర‌తి కుటుంబంలోనూ ఒక పారిశ్రామిక వేత్త‌ను త‌యారు చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్న‌ట్టు తెలిపారు.

టాటా పెట్టుబ‌డులు ఇవే..

టాటా స‌న్స్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ మాట్లాడుతూ.. త‌మ వంతుగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము రెడీగా ఉన్నామ‌న్నారు. ఏపీలో 20 అత్యాధునిక హోట‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా టాటా సోలార్‌ ప‌వ‌ర్ ప్రాజెక్టు, ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టు, విశాఖ‌లో టీసీఎస్ వంటివి ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. త‌ద్వారా.. 10 వేల మంది ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్టు వివ‌రించారు. 

రండి స‌హ‌క‌రిస్తాం!

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని విధాలా స‌హ‌క‌రించే ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలోను, స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. ప్ర‌ధానంగా పారిశ్రామిక వేత్త‌ల‌కు అవ‌స‌ర‌మైన‌ భూములు, నీళ్లు, మానవ వనరులు అందిస్తామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా `పీ4` విధానాన్ని కూడా చేరువ చేస్తున్నామ‌న్నారు. ఫ‌లితంగా పారిశ్రామిక వేత్త‌ల‌కు అన్ని విధాలా త‌మ ప్ర‌భుత్వం చేయూత‌నందిస్తుంద‌న్నారు.