ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పెన్షన్ ల పెంపు, దీపం పథకం వంటివి అమలు చేసిన కూటమి సర్కార్ మిగతా పథకాల అమలు కోసం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పథకంపై మంత్రి పార్థ సారధి కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. అంటే మరో 40 రోజుల్లోపు ఈ పథకం అమలు కాబోతోందని మంత్రి పరోక్షంగా చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో 2 ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలెండర్లు ఇస్తున్నామని చెప్పారు. అందుకోసం రూ. 840 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు.
తాజా బడ్జెట్ లో మరో 2 పథకాల అమలు కోసం నిధులు కేటాయించామని తెలిపారు. అమ్మకు వందనం పథకం కోసం రూ. 6,485 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కోసం రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. నిరుద్యోగభృతికి వచ్చే ఏడాది నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. వైసీపీ సర్కారు దోపిడీతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.1.35 లక్షల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఆ కారణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిద్రమై పోయిందని అన్నారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాల్లో ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు.