ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంది. ఎట్టకేలకు వాటిని ప్రకటిస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల కోసం కష్టపడ్డ చాలామందికి పదవులు దక్కాయి. ఈ జాబితాలో కొన్ని ఊహించని పేర్లు కూడా ఉన్నాయి. అలా ఎక్కువమంది దృష్టిని ఆకర్షించి, ఆమోదం పొందిన పేరు.. చాగంటి కోటేశ్వరరావుదే.
ప్రవచనాల ద్వారా ఆయన కోట్లాదిమందికి చేరువ అయ్యారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆయన్ని అభిమానించేవారి సంఖ్య చాలా పెద్దదే. యువతతో పాటు పెద్దవాళ్లు కూడా మొబైళ్లలో, టీవీలో ఆయన ప్రవచనాలు చూసి స్ఫూర్తి పొందుతుంటారు. చాగంటిని కూటమి ప్రభుత్వం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకుగాను కేబినెట్ హోదాలో సలహాదారు బాధ్యతల్లో నియమించిన సంగతి తెలిసిందే.
చాగంటి ఈ పదవిని స్వీకరించినట్లే తెలుస్తోంది. ఐతే ఆయనకు గత ఏడాది జగన్ ప్రభుత్వం కూడా ఓ పదవిని ఆఫర్ చేసిన విషయం చాలా మందికి తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ధర్మ ప్రచార పరిషత్‌కు సలహాదారుగా ఉండాలని జగన్ సర్కారు ఆయన్ని కోరింది. కానీ ఆయన ఆ పదవిని స్వీకరించలేదు. అందుకు కారణాలేంటన్నది అప్పుడు వెల్లడి కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదవి ఇస్తే మాత్రం స్వీకరిస్తున్నారు.
ఈ తేడాను జనం గమనించాలంటూ సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. జగన్‌కు ఉన్న ఇమేజ్, ఆయన ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను చూసే చాగంటి అప్పుడు పదవి చేపట్టడానికి వెనుకంజ వేసి ఉంటారని.. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న మంచి ఇమేజ్ దృష్ట్యానే ఆయన పదవి చేపడుతున్నారని ఆ పార్టీల మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.