బాబు గారి ఆశలన్నీ ‘జమిలి’ పైనే

మరో రెండేళ్ళల్లో జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయా? అవుననే అంటున్నారు చంద్రబాబు నాయుడు. తాజాగా అమలాపురం లోక్ సభ పరిధిలోని నేతలతో మాట్లాడుతూ 2022లోనే జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు చెప్పినదానికి ప్రకారం మరో రెండేళ్ళల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జమిలి ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులు అందరు రెడీగా ఉండాలంటూ చంద్రబాబు పిలుపిచ్చారు. కరోనా వైరస్ సమస్య తగ్గగానే తాను రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు.

తన పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎంగడతానన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దళితులు, బీసీలపై దాడులు బాగా ఎక్కువైపోయినట్లు మండిపడ్డారు. అధికారపార్టీ నేతల దాడులకు గురవుతున్న వారిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారంటూ స్పష్టం చేశారు. కరోనా వైరస్ తగ్గగానే బాధితులందరినీ తాను నేరుగా కలుస్తానని చెప్పారు. తాను జిల్లాల పర్యటనకు బయలుదేరేముందు సమాచారం కారణంగా జిల్లాల నేతలు అన్నీ ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు.

మనల్ని ఇబ్బంది పెట్టిన వైసిపి నేతలకు వడ్డీతో సహా అన్నీ తీర్చేద్దామని చెప్పి నేతల్లో జోష్ నింపే ప్రయత్నంచేశారు. జమిలి ఎన్నికలంటే ఎంతో కాలం లేదు కాబట్టే ఎన్నికల్లో పాల్గొనేందుకు అందరు రెడీగా ఉండాలని చెప్పారు. అంతా బాగానే ఉందికానీ చంద్రబాబు కోరుకుంటున్నట్లు అసలు జమిలి ఎన్నికలు వస్తాయా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే జమిలి ఎన్నికలు రావాలని చంద్రబాబు తప్ప ఇంకెవరు కోరుకోవటం లేదు. అసలు జమిలి ఎన్నికల విషయాన్ని లేవనెత్తిన ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఇపుడు దాని గురించి పట్టించుకోవటం లేదు.

ప్రధాని ఆదేశాల ప్రకారం జమిలి ఎన్నికలపై ఆమధ్య కేంద్ర ఎన్నికల కమీషన్ గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పార్టీల నేతల్లో చాలామంది జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారిలో బిజేపీ నేతలు కూడా ఉండటం గమనార్హం. దాంతో సమావేశం తర్వాత కేంద్ర ఎన్నికల కమీషనర్ మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చేశారు. జమిలి ఎన్నికలు వినటానికి బాగానే ఉంటుందికాని నిర్వహణ చాలా కష్టమని చెప్పేశారు. అప్పటి నుండి చంద్రబాబు తప్ప ఇంకెవరు దీని గురించి ఆలోచించటం లేదు.