ఆ మహిళలు ఇద్దరూ టీడీపీ నాయకురాళ్లే. కానీ, ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. మీడియాలో కనిపించాలని కూడా అనుకోలేదు. దీంతో వారిపేర్లు..ఊర్లు పెద్దగా తెలియదు. కానీ.. తాజాగా ఆ ఇద్దరు మహిళల వ్యవహారం రాజకీయంగానే కాకుండా.. తెగువ పరంగా కూడా చర్చకు వస్తున్నాయి. వారి గురించి జోరుగా ఆన్లైన్ సెర్చ్ కూడా సాగుతోంది. వీరిలో చంద్రబాబు కోసం ఒక మహిళ, టీడీపీ కోసం మహిళ.. తెగువ ప్రదర్శించారు. ఈ పడతుల తెగువే.. ఇప్పుడు వారికి పదవులను వరించేలా చేసింది.
వాస్తవానికి నామినేటెడ్ పదవుల కోసం అనేక మంది క్యూలో నిలబడ్డారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వేల మంది మహిళా నాయకులు, పురుష నేతలు కూడా క్యూకట్టారు. పదే పదే విన్నవించుకున్నారు. కానీ, అసలు ఈ పదవుల కోసం ప్రయత్నించకుండా.. పార్టీలో తమ పని తాము చేసుకుంటూ పోయిన ఈ ఇద్దరు మహిళలను చంద్రబాబు పిలిచి మరీ పదవుల వర మాలవేయడం ఆసక్తిగా మారింది. దీంతో ఆ ఇద్దరు ఎవరు? ఏం చేశారు? అనేచర్చ జోరుగా సాగుతోంది.
పొడపాటి తేజస్వి: ఈమెకు తాజాగా కేటాయించిన నామినేటెడ్ పదవుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. దీంతో ఈమె ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు.. ఆయన కోసం.. దేశ విదేశాల్లో యువతను, ఐటీ ప్రొఫెనల్స్‌ను ఉద్యమించేలా చేసిన నాయకురాలు.. తేజస్వి. అప్పట్లో ఆమె ఏపీ టీడీపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షురాలిగా ఉన్నారు. బాబును అరెస్టు చేసిన సమయంలో ఆయనకు మద్దతుగా ఐటీ ప్రొఫెషన్లను రోడ్లపైకి తెచ్చి.. పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఒక సందర్భంలో అరెస్టు కూడా అయ్యారు. ఆమె కృషికి గుర్తింపుగా.. బాబు నామినేటెడ్ పదవిని అప్పగించారు.
రెంటచింతల మంజుల: ఈమె కూడా పార్టీ నాయకురాలే. ఈమెకు ఏపీ శిల్పారామం క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ చైర్మన్‌గా చంద్రబాబు పదవి ఇచ్చారు. అయితే.. ఈమె పార్టీ కోసం.. తెగువను ప్రదర్శించారు. సాధారణంగా చిన్నగాయానికే మహిళలు ఓర్చుకోలేరు. అలాంటిది ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన మాచర్ల నియోజకవర్గం రెంట చింతల గ్రామంలోని పోలింగ్ బూత్‌లో మంజులారెడ్డి టీడీపీ తరపున ఏజెంట్‌గా వెళ్లారు.
అయితే.. అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతల మూక దాడిలో ఆమె తలకు బలమైన గాయమైంది. గొడ్డలితో ఆమె తలపై వేటు వేయడంతో ఒకవైపు మడుగు కడుతున్న రక్తం.. మరోవైపు తీవ్రమైన బాధ. అయినా.. మంజుల వెనుదిరిగి వెళ్లిపోలేదు. మాచర్లలో టీడీపీ కోసం బూత్‌లోనే కూర్చున్నారు. ఈ తెగువ అప్పట్లోనే ఆమెకు ప్రసంశలు తీసుకురాగా.. ఇప్పుడు చంద్రబాబు ఆమెను పదవితో ఘనంగా సత్కరించారు.