కేసీఆర్ రంగ ప్ర‌వేశం ఎప్పుడంటే

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్ప‌టికే వేడి వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌ల‌కు, విప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కులు, మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావుల మ‌ధ్య మాట‌ల యుద్ధ కొన‌సాగుతోంది. మ‌రో ప్ర‌తిప‌క్షం బీజేపీ కూడా.. హాట్ హాట్‌గానే రాజకీయాలు సాగిస్తోంది. ముఖ్యంగా మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌, హైడ్రా వ్య‌వ‌హారం, రైతుల‌కు హామీలు, గ్యారెంటీల అమ‌లు వంటివి రాజ‌కీయంగా ఇప్ప‌టికే కాక రేపుతు న్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో వ్య‌వ‌హారం కూడా తెలంగాణ రాజ‌కీయాల‌ను యూట‌ర్న్ తిప్పేయ‌నుం ద‌ని తెలుస్తోంది.

అదే.. మాజీ సీఎం, పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ కేసీఆర్ రంగ ప్ర‌వేశం. ఈ నెల చివ‌రి వారంలో కేసీఆర్ యాక్టివ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. గ‌త మూడు మాసాలుగా కేసీఆర్ రాజ‌కీయంగా సైలెంట్ అయిన విష‌యం తెలిసిందే. ఎప్పుడో బ‌డ్జ‌ట్ స‌మావేశాల స‌మ‌యంలో అసెంబ్లీకి వ‌చ్చిన కేసీఆర్.. బ‌డ్జ‌ట్‌పై కామెంట్లు చేసి వెళ్లిపోయారు.

ఆత‌ర్వాత‌.. కేసీఆర్ మ‌ళ్లీ రాజ‌కీయంగా ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఎక్క‌డా కూడా క‌నిపించ‌నూ లేదు. ముఖ్యంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ ఎస్‌కు చావు దెబ్బ త‌గిలిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. కేసీఆర్ మౌనంగా ఉండ‌డం.. కేటీఆర్‌, హ‌రీష్‌రావులు మాత్ర‌మే దూకుడుగా ఉన్న నేప‌థ్యం అంద‌రూ గ్ర‌హించారు. అయితే.. అనుకున్న రేంజ్‌లో బీఆర్ ఎస్‌కు ఊపు అయితే రావ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు ఈ గ్యాప్‌ను త‌గ్గించేందుకు.. ప్ర‌జ‌ల్లో సింప‌తీని గెయిన్ చేసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టేందుకు ఈ నెల ఆఖ‌రు నుంచి రాజ‌కీయంగా ప్ర‌స్థానాన్ని కొత్త‌గా ప్రారంభించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. తొలిద‌శ‌లో ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వ బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డంతోపాటు.. వారికి ఆర్థిక సాయం కూడా చేయ‌నున్నారు. త‌ద్వారా.. కేసీఆర్ ప్ర‌జ‌ల సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు త‌న ప్రాధాన్యాన్ని ఆయ‌న మ‌రోసారి వివ‌రించే ప్ర‌య‌త్నం కూడా చేస్తారు. మొత్తానికి కేసీఆర్ రాక ఖాయ‌మైంది. దీంతో తెలంగాణ రాజ‌కీయం మ‌రింత కాక పుట్టిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.